వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ డిప్లొమా ఇంజినీర్స్‌ కార్యవర్గం ఎన్నిక

చేబ్రోలు: మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ తరఫున దాఖలు చేసిన నామినేషన్లను స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు అకారణంగా, చిన్నచిన్న కారణాలతో తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదివారం తెనాలి ఇన్‌చార్జి ఆర్డీఓ లక్ష్మీకుమారిని కలిసి అప్పీలు చేసుకున్నారు. ఆదివారం ఉదయం తెనాలిలోని ఆర్డీఓ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు వకాల్తా వేశారు. చిన్నచిన్న తప్పులతో ఎన్నికల అధికారులు 11 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 19 మంది నామినేషన్లు తిరస్కరించారని వివరించారు. వీరిలో 15 మంది నామినేషన్లు సక్రమంగానే ఉన్నప్పటికీ డ్వాక్రాలో రుణం ఉందని, రెండుచోట్ల ఓటు హక్కు ఉందని, ద్విచక్ర వాహనం వివరాలు తెలియజేయలేదని, చిన్న చిన్న కారణలతో తిరస్కరించినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ తరఫున న్యాయవాదులు చింకా సురేష్‌ చంద్ర యాదవ్‌, కె.ఎం.విల్సన్‌, డి.మల్లికార్జునరెడ్డి, మందపాటి కోటేశ్వరరావు, పాపిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వి.మల్లేశ్వరరావు ఉన్నారు. నామినేషన్లు తిరస్కరణకు గురై తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద అప్పీల్‌ చేయటానికి చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పెండ్ర వెంకటేశ్వర్లు, షేక్‌ నజీర, షేక్‌ ఖాసింబీ, దానబోయిన గోవిందరాజులు, మైనం రవికుమార్‌, జువ్వా నాంచారమ్మ, పసుపులేటి బాజిబాబు, మన్నెం ఉషారాణి, మరో 6 గురు అభ్యర్థులు హాజరయ్యారు.

కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడుగా ఆర్‌.మోహన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం ఆదివారం పొన్నూరు రోడ్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగింది. సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడుగా ఆర్‌.మోహన్‌రావుతోపాటు సలహాదారుగా ఏ.గురునాథరావు, ఉపాధ్యక్షుడుగా టీవీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా జి.బ్రహ్మయ్య, సహాయ ప్రధాన కార్యదర్శిగా వి.ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎల్‌.బ్రహ్మం, ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎస్‌కే గౌస్‌, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీఎల్‌ శ్రీనివాస్‌, ఎస్‌.వీర బ్రహ్మం, పి.వసంతలక్ష్మి, కార్యాలయ కార్యదర్శిగా పి.సురేంద్ర, ఆర్ధిక కార్యదర్శిగా డి.అనూప్‌ సచిన్‌ కుమార్‌లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ రెండు సంవత్సరాలు కొనసాగనుంది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సహచరులందరూ అభినందనలు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శేషారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి.సన్యాసిరావు, సదరన్‌ డిస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఏవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement