అనుమతులు లేకుంటే చర్యలు
సింగిల్ విండో సెల్
నామినేషన్లు ముగియడంతో ప్రచారాలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
వాహనాలకు, లౌడ్ స్పీకర్లు, సభలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి
లేదంటే అభ్యర్థులకు ఇబ్బందులే
తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సెల్ ద్వారా అనుమతులు మంజూరు
ప్రత్తిపాడు: అభ్యర్థులూ నామినేషన్ దాఖలు చేశారా.. ఇక ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారా.. మైకులతో వీధి వీధినీ చుట్టేద్దామనుకుంటున్నారా.. అయితే ఒక్క నిమిషం. మీ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. లేదంటే అభ్యర్థులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితులు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 58 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గ వర్గం మొ త్తం మీద ఆయా రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు 330కు పైగా నామినేషన్లు దాఖ లు చేశారు. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
అనుమతులు కావాల్సిందే..
ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అనేక రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.
● అభ్యర్థులు సభలకు, ఇంటింటి ప్రచారాలకు, ఊరేగింపులకు పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు, ఎంత మంది హాజరవుతారు, స్థల యజమాని పేరు, ఆతని నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంది. ఓటర్‌కార్డు, స్థల యజమాని ఎన్‌ఓసీ, ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి.
● లౌడ్ స్పీకర్ అనుమతి కూడా కచ్చితంగా పొందాలి. ఎప్పుడు, ఎక్కడ(వాహనంపైనా, స్థిరంగానా) వాడతారన్న వివరాలు దరఖాస్తులో తెలియజేయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోపు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. సౌండ్ 75 డీబీ కన్నా మించదని, ఒక సభకు మూడు లౌడ్ స్పీకర్లకన్నా అదనంగా వాడనని, ఎన్నికల నియమావళి పాటిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. అనంతరం అనుమతి మంజూరు చేస్తారు.
● అభ్యర్థి ఎన్నికల రోజు పర్యటించేందుకు వాహనానికి కూడా అనుమతి తప్పనిసరిగా పొందాలి. వినియోగించే వాహనం నంబరును నమోదు చేసి నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి పర్మిషన్ పొందాలి.
అనుమతులకు సింగిల్ విండో సెల్..
అభ్యర్థుల ప్రచార అనుమతుల కోసం ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సెల్‌ను ఏర్పాటు చేశారు. అనుమతులు కావాల్సిన వారు ముందుగా పోలీస్ స్టేషన్ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలి. అనంతరం సింగిల్ విండో సెల్‌లో దరఖాస్తు చేసుకుంటే వారు వివరాలు పరిశీలించి అనుమతులిస్తారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు మంజూరవుతాయి.
ఉల్లంఘనలపై డేగ కన్ను..
అనుమతులు లేకున్నా.. ఇష్టారీతిన ఎన్నికల ప్రచారం నిర్వహించినా అభ్యర్థులు అడ్డంగా బుక్కవుతారు. అభ్యర్థుల కదలికలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు, పరిశీలనకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను నియమించింది. వారు గ్రామాల్లో పర్యటిస్తూ డేగ కన్నుతో ప్రచార, ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు.
కండీషన్స్ అప్లై..
ప్రచారాలు నిర్వహించే సమయంలో అభ్యర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అభ్యర్థులు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయకూడదు. ఆలయాలు, మసీదులు, చర్చిలను ప్రచార వేదికలుగా వినియోగించకూడదు. ఇళ్లు, ప్రహరీలపై సంబంధిత యజమానుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, ఫ్లెక్సీలు, బ్యాన ర్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు, ప్రజాధనంతో నిర్వహించే వనరులను ప్రచారానికి ఉపయోగించకూడదు. కరపత్రాలు, గోడపత్రికలు తదితర ముద్రిత ప్రచార సామగ్రిపై ముద్రించిన వారి పేరు, చిరునామాతో పాటు ప్రచురణకర్త పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలి.
అభ్యర్థులు ప్రచారాలకు కచ్చితంగా అనుమతులు పొందాలి. వాహనాలు, లౌడ్ స్పీకర్లు, సభలు, సమావేశాలు, ప్రచారాలకు అనుమతులు తప్పని సరి. లేదంటే కఠిన చర్యలు తప్పవు.
– ఎన్.నరహరి, ఎస్‌ఐ, ప్రత్తిపాడు
అభ్యర్థుల ప్రచారాలకు అనుమతులిచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సెల్ ఏర్పాటు చేశాం. పోలీసు స్టేషను నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకుని సింగిల్ విండో సెల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి రిటర్నింగ్ అధికారి అనుమతులు మంజూరు చేస్తారు.
– కె.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, ప్రత్తిపాడు


