పలువురు యువకుల అరెస్ట్ రాయగఢ్ నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు సీఐ వీరాస్వామి వెల్లడి
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని న్యూ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రదేశంలో గంజాయి విక్రయించేందుకు వేచి ఉన్న ముగ్గురు యువకులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల అందించిన వివరాలు.. గంజాయి అక్రమ నిల్వలు, విక్రయాలపై అందిన సమాచారం మేరకు సీఐ కె. వీరాస్వామి సిబ్బందితో కలిసి న్యూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను పట్టుకుని తనిఖీ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని మొగిలి గోపి, తాడిశెట్టి మాధవన్, ఇటుకల రాహుల్‌గా గుర్తించారు. వీరిలో గోపి మంగళగిరిలోని రత్నాలచెరువు ఎస్టీ కాలనీకి చెందినవాడు కాగా, అతని అసలు నివాసం గుంటూరులోని శ్రీనివాసరావునగర్, మాధవన్ మంగళగిరిలోని మహాలక్ష్మి చెట్టు సెంటర్ ప్రాంతంలో ఉంటుండగా, అతని స్వస్థలం మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామం, రాహుల్ మంగళగిరిలోని రత్నాలచెరువు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. గోపి, మాధవన్, రాహుల్‌తో పాటు శాంతి రాజు, హనుమంతు అనే మరో ఇద్దరితోనూ స్నేహం ఉండేది. మంగళగిరి రైల్వేస్టేషన్ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో సుమారు రెండేళ్ల క్రితం ఒక సాధువు ద్వారా రాయగఢ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయించే వ్యక్తుల గురించి తెలుసుకున్నట్లు గోపి తెలిపినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పటి నుంచి స్నేహితులంతా అప్పుడప్పుడు రైలులో రాయగఢ్‌కు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం ఐదుగురు కలిసి రాయగఢ్ ప్రాంతంలో 2,500 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు, అందులో శాంతి రాజు, చైతన్య చెరో 500 గ్రాములు తీసుకెళ్లగా, మిగిలిన 1,500 గ్రాములను రాహుల్ ఇంటి వద్ద దాచినట్లు గోపి పోలీసులకు తెలిపాడు. కొంత గంజాయిని వినియోగించగా, మరికొంత విక్రయించినట్లు, మిగిలిన గంజాయిలో నుంచి 500 గ్రాముల చొప్పున గోపి, మాధవన్ వద్ద, 100 గ్రాములు రాహుల్ వద్ద ఉంచుకుని విక్రయించేందుకు బస్టాండ్ వద్దకు వచ్చిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో నమూనాల సేకరణ అనంతరం గంజాయిని రసాయన పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.


