గుంటూరు వెస్ట్: గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఈనెల 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కల్పించాలని స్పష్టం చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ పట్ల ముందస్తు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం జరగరాదని, సామగ్రిలో ఏ ఒక్కటి లేదనే మాట రాకూడదన్నారు. పోలింగ్ సామగ్రి స్వీకరణ ఒక క్రమ పద్ధతిలో నిర్వహించి త్వరగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాలని తెలిపారు.
ఫొటో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలి
ఓటర్లకు ఫొటో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ పక్కల పరిశుభ్రత పాటించాలని, మరుగుదొడ్లు ఉండాలని, తాగునీరు, విద్యుత్, ఆహార పంపిణీ అంశాలపై ఎటువంటి లోటుపాట్లు ఉండరాదన్నారు. మైక్రో పరిశీలకుల శిక్షణ కార్యక్రమం ఈ నెల 26న స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ మాట్లాడారు.
నవంబరు 1న సెలవు
గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘానికి నవంబరు 1వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించామన్నారు. పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున అక్టోబర్ 31, నవంబరు 1 తేదీల్లోనూ, నవంబరు 3వ తేదీన, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగిస్తున్న అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలలో కార్యకలాపాలకు స్థానిక సెలవులు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


