న్యూస్‌రీల్
నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధిపై నిలదీయాలి
అభ్యర్థులకు పార్టీ అండ
● ఇంటింటికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన
వైఎస్ జగన్ పాలనను ప్రజలకు
గుర్తు చేద్దాం
● నామినేషన్లు వేయనివ్వని దౌర్జన్యాల
కూటమికి చెంపపెట్టులా సుప్రీం తీర్పు
● కూటమి అవినీతి, అక్రమాలను
ప్రజలకు చెప్పే బాధ్యత మనదే
● సూపర్‌సిక్స్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ
నిధి ఎగ్గొట్టిన కూటమిని నిలదీయాలి
● కార్పొరేటర్ సీట్ల కేటాయింపులో
వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం
● వైఎస్సార్ సీపీ రీజినల్
కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
● వైఎస్సార్ సీపీ కార్పొరేటర్
అభ్యర్థులతో సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలకసంస్థలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేద్దామని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటికీ చేసిన మేలు, కూటమి రెండున్నరేళ్ల పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల భుజస్కంధాలపై ఉందని స్పష్టం చేశారు. బుధవారం శ్రీనివాసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని 76 వార్డుల నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పండుగలా కొనసాగిన గత వైఎస్సార్ సీపీ పాలనతో పోల్చితే రెండున్నరేళ్లుగా కూటమి పాలనలో దౌర్జన్యాలు, దాడులు, అవినీతి రాజ్యమేలుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్ సువర్ణ పాలనలో గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్లు ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసిన పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగయ్యాయని, ఏఎన్‌ఎంలను ఇంటికే పంపి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యారోగ్య సేవలు, ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి నాణ్యమైన విద్యను అందించిన తీరుపై ప్రతి ఇంటికీ, ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రచారం ఎంత ముఖ్యమో, పోలింగ్, కౌంటింగ్ రోజున అంతే అప్రమత్తంగా ఉండాలన్నారు. 76 వార్డుల్లో 37 బీసీలకు, 11 మైనార్టీలకు ఇవ్వడంతోపాటు మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా దాడులు, దౌర్జన్యాలు సాగించిన కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చెంప పెట్టు వంటి తీర్పు ఇచ్చిందన్నారు.
అందరినీ కలుపుకొని ముందుకు..
మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. మేయర్‌గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు కార్పొరేషన్ గెలుపును బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు.
అక్రమ కేసులకు భయపడొద్దు
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై టీడీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడకుండా పోరాటం చేశామన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు భయపడకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు కదం తొక్కారని, అడ్డంకులు, నిర్బంధాన్ని దాటుకుని తెగువ చూపుతున్నారన్నారు. గుంటూరు మేయర్ స్థానాన్ని కై వసం చేసుకుని వైఎస్ జగన్‌ను కలుద్దామని పిలుపునిచ్చారు.
● వైఎస్సార్ సీపీ ఆర్యవైశ్య నేత ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ దమ్ము, ధైర్యమున్న నాయ కుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఫీలవ్వాలన్నారు. ఆర్యవైశ్యులను గుర్తించి, మేయర్ సీటు ఇచ్చిన వైఎస్సార్ సీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించాలని కోరారు. ఆర్యవైశ్య ప్రతినిధి ఆత్మకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు గుర్తింపు ఇచ్చిన వైఎస్సార్ సీపీ గెలుపు కోసం పోరాటం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, అసెంబ్లీ పరిశీలకు రాలు నల్లమోతు రూత్ రాణి, ఆర్యవైశ్య నాయకు డు దేవరశెట్టి సత్యనారాయణ, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి, మహిళలకు అడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేశారని ఆరోపించారు. ఓట్లు అడిగేందుకు ఇంటింటికీ వచ్చే కూటమి అభ్యర్థులను రెండున్నరేళ్లుగా నిరుద్యోగులకు రావాల్సిన రూ.84వేలు, మహిళలకు ఇవ్వాల్సిన రూ.42వేలను ఇవ్వాలని ప్రజలు పట్టు బట్టాలన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి తేలిన తరువాతే ఓటు అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవ్వరితో పొత్తులు లేకుండా ముందుకెళ్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తలెత్తుకుని తిరగాలన్నారు. వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కూటమిని చూసి వెనుకడుగు వేయవద్దని, ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరకు ఉత్సాహంగా వెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి నుంచి అనేక విధాలుగా ఒత్తిడులను ఎదుర్కొని పోటీలో నిలబడిన అభ్యర్థులకు పార్టీ అండగా ఉందనే విషయాన్ని మరువరాదన్నారు. కార్పొరేటర్ అభ్యర్ధితో పాటు మేయర్ అభ్యర్థికి చెరొక ఓటు చొప్పున రెండు ఓట్లు వైఎస్సార్ సీపీకే వేయాలని ప్రజలకు వివరించాలని సూచించారు. మీ వెనుక మేమున్నామని, మనందరి వెనుక మహాశక్తిగా వైఎస్ జగన్ ఉన్నారని స్పష్టం చేశారు.


