తూర్పు ఎమ్మెల్యే నసీర్ కార్యాలయంలో పండుగపూటా ఘర్షణలే.. పట్నంబజారు: అడుగడుగున అసమ్మతి సెగలు రగులుగుతున్నాయి.. ఎన్నికల వేళ నమ్మించి నట్టేట ముంచాడని తూర్పు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. కార్పొరేషన్ ఎన్నికల వేళ సీట్లు సర్దుబాటు కాకపోవటంతో జనసేన, బీజేపీ నేతలు కూడా వారి అభ్యర్థులకు బీ ఫారాలు ఖరారు చేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిలో వారికే సమన్వయం లోపించటంతో.. పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఏకపక్ష ధోరణితో పరిస్థితులు తలకిందులు అయ్యాయని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 31 స్థానాలు ఉన్నాయి. దానిలో భాగంగా టీడీపీ పూర్తిస్థాయిలో జనసేన, బీజేపీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అందరికీ తెలిసిన విషయమే. దీనికి తగ్గట్లు టీడీపీ కోసం కష్టపడి పని చేసిన నేతలకు కాకుండా నసీర్ అహ్మద్ డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయించారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో దసరా రోజున 22వ డివిజన్‌కు సంబంధించిన జనసేన నేత సంకూరి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న ప్రసాద్‌లు బీ ఫారాలు ఇస్తున్న క్రమంలో పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో పిడిగుద్దులు కురిపించుకున్నారు. అప్పటికే బీ ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పది నిముషాల వ్యవధిలోనే అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే ఒకటో డివిజన్‌కు సంబంధించిన నేతలు అధిష్టానానికి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. రెండో డివిజన్‌కు సంబంధించి ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్దనే బేళ్ల వెంకటేశ్వర్లు యాదవ్ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళనలు నిత్యం పరిపాటిగా మారాయి. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు, పార్టీ నేతల్లో ఏర్పడిన నిరాశతో.. కూటమి గెలుపుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.
తూర్పు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా సీట్లు కేటాయించిన ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్, 74వ డివిజన్‌లో మాత్రం తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అదే వార్డులో టీడీపీ నుంచి సముద్రాల గణేష్, గుడిపల్లి వాణి, సోమశేఖర్‌తో పాటు కొంత మంది జనసేన నేతలు కూడా సీటు కోసం పోటీ పడటంతో పాటు నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు. అయితే 74వ డివిజన్‌కు సంబంధించి గుడిపల్లి వాణికి సీటు ఇవ్వకుండా ఆమె మరిది భార్య గుడిపల్లి స్వాతికి సీటు కేటాయించారు. బుధవారం ఉదయం వరకు ఆ డివిజన్‌ను పెండింగ్‌లో పెట్టారు. అయితే ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ గుడిపల్లి స్వాతికి సీటు కేటాయించడం చర్చనీయాంశమైంది. డివిజన్‌లో పని చేసుకోవాలని సూచించిన సోమశేఖర్, సముద్రాల గణేష్‌లకు మొండి చేయి చూపించారు. అయినప్పటికీ సోమశేఖర్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోలేదని తెలుస్తోంది.
టీడీపీకి సహకరించకుండా రెబల్స్ మాదిరిగా వ్యవహరిస్తే.. పార్టీ ఉన్న పదవులు కూడా పీకేస్తానని ఎమ్మెల్యే నసీర్, ఆయన అనుచరగణం ఆ పార్టీ డివిజన్ కేడర్ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. పార్టీ కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వని నసీర్‌అహ్మద్ ఇటువంటి బెదిరింపులకు దిగితే తామేమి భయపడేది లేదని క్యాడర్ స్పష్టంగా చేస్తోంది. ఆఖరికి చిన్నాచితక నేతలను సైతం పోలీసులతో బెదిరించే నీఛ దుస్థితికి దిగజారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి సీనియర్లు సహకారం లేకపోవటం, క్యాడర్ దూరం కావటంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
కూటమిలో కుమ్ములాటలు
కూటమిలో భాగమైన జనసేన, బీజేపీలకు సంబంధించి.. పలు డివిజన్‌లలో బీ ఫారాలు విడిగా కేటాయించారు. ఆడలేక మద్దెల ఓడు... అన్న సామెతను తలపించేలా.. సీట్ల కేటాయింపులో వారికి సర్దిచెప్పలేక ‘ఫ్రెండ్లీ కాంపిటేషన్’ అనే పేరుతో బీఫారాలు ఇచ్చామని చెప్పుకోవటం కూటమి నేతల సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో 10, 13, 22తో పాటు అనేక డివిజన్‌లలో ఇండిపెండెంట్‌గా వేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు రెబెల్ అభ్యర్థులు కూడా ఎంతోమంది వెనక్కి తీసుకోని పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. దీంతోపాటు 10, 22, 24, 41, 43 డివిజన్‌లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా బీఫారాలు అందజేశారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో నిత్యం ఘర్షణలు
74వ డివిజన్‌లో చివరివరకు ఉత్కంఠ
పార్టీ పదవులు తీసేస్తానంటూ బెదిరింపులు..
కూటమి నుంచి తీవ్ర వ్యతిరేకత
ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే
పార్టీకి సహకరించేదే లేదని తేల్చిచెప్పిన
ఆయా డివిజన్ల టీడీపీ నేతలు
జనసేన, బీజేపీల నుంచి పలువురు
అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
కూటమిలో వర్గ విభేదాలు..
పిడిగుద్దులు కురిపించుకున్న వైనం