నగరంపాలెం: విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించారు. వివిధ రకాల ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కర్పూర హారతి సమర్పించారు. ప్రజలు అందరూ సుఖశాంతులతో జీవించాలని, జిల్లా ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో, బీడీ టీం కార్యాలయంలో ఆయుధాలకు, ద్విచక్ర వాహనాలు, కార్లకు పూజలు చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం, వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పోలీస్ కవాతు మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని, అధునాతనమైన జిమ్‌ను వేర్వేరుగా ప్రారంభించారు. డీఎస్పీలు అళహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), జి.పూర్ణచంద్రరావు(గుంటూరు దక్షిణ), బెల్లం శ్రీనివాసరావు(గుంటూరు పశ్చిమ), సంకురయ్య(ఏఆర్), ఆర్‌ఐ (పరిపాలన) కృష్ణయ్య, ఆర్‌ఐ ఎంటీ.శ్రీహరిరెడ్డి, ఆర్‌ఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.
కూటమి నేతలకు సుప్రీం ఆదేశాలు చెంపపెట్టు..
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నెలకొన్న అక్రమాలపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు చంద్రబాబు నాయుడుకు, కూటమి నేతలకు చెంపపెట్టులాంటిదని గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరగడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.


