పట్నంబజార్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలపై బైండోవర్ కేసుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాత గుంటూరు పోలీసుస్టేషన్‌లో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేశారు. ట్రబుల్ మంగర్స్ లిస్ట్‌లో అతని పేరు చేర్చి బైండోవర్ చేసినట్లు తెలిసింది. దీంతోపాటుగా మరో 10 మందికి ఫోన్ కాల్స్ చేసి స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు ఫోన్ కాల్స్ చేస్తున్న వారిలో కొంత మంది కార్పొరేటర్ అభ్యర్థులు కూడా ఉన్నారని సమాచారం. నేడో రేపు వీరిని స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.
నేడు పోలీసు పీజీఆర్‌ఎస్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు దృష్ట్యా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవర ణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోలీస్ అధికార, సిబ్బంది విధుల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ తాత్కాలిక రద్దుని జిల్లాలోని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో సగటు వర్షపాతం 13 మిల్లీమీటర్లు
కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా తెనాలి మండలంలో 57.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో ఒక మి.మీ వర్షం కురిసింది. సగటున 13 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదనందిపాడు మండలంలో 34.2 మి.మీ., దుగ్గిరాల 23, పొన్నూరు 21.4, కాకుమాను 19.2, కొల్లిపర 18.4, మంగళగిరి 12.6, చేబ్రోలు 11, ఫిరంగిపురం 8.6, ప్రత్తిపాడు 8.2, గుంటూరు పశ్చిమ 4.1, తుళ్ళూరు 4, పెదకాకాని 3, తాడేపల్లి 2.6, తాడికొండ 2.2, మేడికొండూరు 1.6, గుంటూరు తూర్పులో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. అక్టోబర్ మాసం 18వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 75.1 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 22.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
రెండు వాహనాలు ఢీ
ఒకరు మృతి
మేడికొండూరు: గుంటూరు–నరసరావుపేట ప్రధాన రహదారిపై పేరేచర్ల యూనివర్సల్ కాలేజీ సమీపంలో ఆదివారం ఉదయం రెండు టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ గాయపడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ఖాళీ టాటా మ్యాజిక్ వాహనం, నరసరావుపేట నుంచి గుంటూరు వైపు పత్తి లోడుతో వస్తున్న మరో టాటా మ్యాజిక్ వాహనం పేరేచర్ల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పత్తి లోడ్ వాహనం డ్రైవర్ వర్ల కిరణ్‌బాబు (24) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. గుంటూరు నుంచి వస్తున్న ఖాళీ వాహనం డ్రైవర్ కూడా గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆలయ హుండీ చోరీ
యడ్లపాడు: యడ్లపాడు గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక ఎర్రచెరువు వద్ద కొలువైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని హుండీలోని నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో హుండీ లెక్కింపు ప్రక్రియ జరిగిందని, ఆ తర్వాత ఈ చోరీ చేసినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి జిల్లా నుంచి క్లూస్‌టీంను పిలిపించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


