తాడికొండ: రాజధానిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ శనివారం పర్యటించారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం బృందానికి సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఏ భార్గవతేజ, టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, అభిషేక్‌కుమార్ స్వాగతం పలికారు. ప్రధాన కార్యాలయంలోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అమరావతి విజన్, విస్తృత నగర ప్రణాళిక, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అత్యాధునిక డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నగర అభివృద్ధిలో అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయనకు వివరించారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు బి.వంశీ ఎంపికై నట్లు జేకేసీ కళాశాల పీడీ బి.కృష్ణారావు శనివారం తెలిపారు. ఈనెల 23 నుంచి చైన్నెలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాడని వివరించారు. కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వంశీ ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో అండర్– 18 బాలుర విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. వంశీ జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. వంశీని కరస్పాండెంట్ మురళీమోహన్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపాల్ కే సాంబశివురావు అభినందించారు.
నెహ్రూనగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిర్దేశించిన నమూనాలోనే తప్పనిసరిగా సమర్పించాలని ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలీషా స్పష్టం చేశారు. అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శనివారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలీషా మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా జరిగేలా అకౌంటింగ్ బందాలు పనిచేయాలన్నారు. ప్రచార సామాగ్రి, వాహనాలు, కార్యకర్తల కోసం చేసే ఖర్చులను ఎస్‌ఈసీ ప్రొఫార్మాలోనే నమోదు చేసి, ఫలితాలు వెల్లడైన 45 రోజుల్లోగా ఎన్నికల అధికారులకు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు చూపించే ఖర్చులను పరోక్ష పర్యవేక్షణ ద్వారా ‘షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్’ (ఎస్‌వోఆర్)లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చి చూస్తామని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ తదితర వ్యయ పర్యవేక్షణ బందాలు మార్గదర్శకాలకు లోబడి విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్ తిరుపతి నాయుడు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ తిరుపతయ్య, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.


