ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

తెనాలిలో ఒకటి, గుంటూరులో మూడు కేసులు నమోదు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: జిల్లాలో ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా ఎన్నికల సంఘం నిబంధనలు, అమల్లో ఉన్న ఆంక్షలను విధిగా పాటించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు నిర్వహణకు ముందస్తు పోలీసుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల వేళల్లో మైకులు, డీజేలు వినియోగించేందుకు కూడా అనుమతులు ఉండాలని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అమలవుతున్న సెక్షన్‌ 163(పాత సెక్షన్‌ 144) కింద విధించిన ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి తెనాలిలో ఒకటి, గుంటూరులో మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ

చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులకు మాదకద్రవ్యాల వల కలిగే అనర్థాలు, వాటి నివారణపై ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ అవగాహన కల్పించారు. యువత చెడు స్నేహాలకు, సోషల్‌ మీడియా ప్రభావానికి లోనుకాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు దేశ చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రవికృష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల సమస్య కేవలం ఆరోగ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, అక్రమ డ్రగ్స్‌ వ్యాపారం ద్వారా సమకూరే నిధులు ఉగ్రవాదం, అక్రమ ఆయుధాల రవాణా వంటి కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు. విద్యార్థులు స్నేహితుల ఒత్తిడికి తలొగ్గకుండా డ్రగ్స్‌కు ధైర్యంగా ‘నో’ చెప్పాలని, వ్యసనానికి గురైన వారిని దూరం పెట్టకుండా వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌, పునరావాసం పొందేలా సహకరించాలని కోరారు. క్రీడలు, యోగా, వ్యాయామం, సామాజిక సేవ, రక్తదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఆపరేషన్‌ చైతన్య, ఆపరేషన్‌ వజ్రప్రహార్‌, ఆపరేషన్‌ సేఫ్‌ క్యాంపస్‌, ఆపరేషన్‌ గరుడ, ఈగల్‌ పల్లెబాట వంటి కార్యక్రమాల ద్వారా గంజాయి సాగు, అక్రమ రవాణా, డ్రగ్స్‌ విక్రయాలు, నియంత్రిత ఔషధాల దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, జీఐఎస్‌ మ్యాపింగ్‌, ఉపగ్రహ, డ్రోన్‌ చిత్రాల విశ్లేషణ వంటి సాంకేతిక రంగాల్లో విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పొన్నూరు టౌన్‌ సీఐ కిషోర్‌, గుంటూరు ఈగల్‌ ఎస్‌ఐ ఎం.సునీల్‌బాబు పాల్గొన్నారు.

ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 16.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా తుళ్లూరు మండలంలో 0.8 మి.మీ వర్షం కురిసింది. సగటున 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌ నెలలో 17వ తేదీ నాటికి జిల్లాలో సాధారణ వర్షపాతం 71 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 9.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement