జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుంటూరు, తెనాలి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామన్నారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 15న ప్రారంభమై నవంబర్ 26న పోలింగ్, రెండో దశ నామినేషన్లు నవంబర్ 18న ప్రారంభమై నవంబర్ 29న పోలింగ్, మూడో దశ నామినేషన్లు నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 76 వార్డులు, తెనాలి పట్టణంలో 52 వార్డులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. గుంటూరు పరిధిలో 6,09,667 మంది, తెనాలి పరిధిలో 1,57,089 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ కోసం 50 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 50 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం ఉండదు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎటువంటి జాప్యం ఉండదన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం కలిగిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన వారికి 24 గంటల్లోగా పత్రాలు అందించేలా ఏర్పాటు చేశామన్నారు. సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. జిల్లాలో 6000 మంది ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియకు నియమించామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు.
పార్టీల సహకారం అవసరం
జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారంతోపాటు ప్రజల మద్దతు అవసరమని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వీలైనంత వరకు పరిష్కరిస్తామని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కె ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.పిచ్చిరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు సీహెచ్.వాసు తదితరులు పాల్గొన్నారు.


