గుంటూరు ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ అశుతోష్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ బాధ్యత రిటర్నింగ్ అధికారులదేని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై స్పష్టంగా అవగాహన పొంది, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారుల స్థాయిలో స్టాటిక్, సర్వేలైన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఖర్చుల పరిశీలన బృందాల నియామకం పూర్తి చేసి, పర్యవేక్షణ చేయాలని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు చేసిన ప్రతి పైసా నమోదు కావాలని చెప్పారు. అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని, మీడియాలో ప్రచురితమయ్యే ప్రకటనలను ఖర్చుల కింద లెక్కిస్తామని తెలిపారు. చట్టబద్దమైన అంశాలతో పాటు, చట్టం బద్దం కాని అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు విధానాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
ఎన్నికల నియమావళి అమలు పక్కాగా చేయాలి
ఎన్నికల నియమావళి అమలు పక్కాగా చేయాలని జేసీ ఆదేశించారు. స్టాటిక్, సర్వైలైన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఖర్చుల పరిశీలన బృందాలతో కలెక్టరేట్‌లో సమీక్షించిన జేసీ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలుతోపాటు ప్రతీ రోజూ ఖర్చుల వివరాలు కంట్రోల్ రూమ్‌కు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎన్‌ఎస్‌కె ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీఈవో షేక్ సలీమ్ బాషా, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ లోచర్ల రమేష్, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


