కాకుమాను రాజశేఖర్‌ మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

కాకుమాను రాజశేఖర్‌ మృతికి సంతాపం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

కాకుమాను రాజశేఖర్‌ మృతికి సంతాపం భారీ వర్షాల దృష్ట్యా పోలీసు శాఖ అప్రమత్తం ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లపై చర్చ బ్యాంకింగ్‌ సేవలకు సమ్మె సెగ

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతిపట్ల అంబటి రాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి కృష్ణమాచారి, గేదెల రమేష్‌, జిల్లా సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షుడు కొరిటపాటి ప్రేమ్‌కుమార్‌, లీగల్‌ సెల్‌ నగర అధ్యక్షుడు కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, నగర యువజన విభాగాధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మొండితోక శ్రీనివాసరావు, న్యాయవాదులు వజ్రాల రాజశేఖర్‌ రెడ్డి, అడప ఇందిరా, లలితాబాయి, చల్లా క్రాంతి కుమార్‌, పార్టీ నాయకులు పిల్లి మేరీ, నల్లక వెంకట వేణు తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల తీవ్రత, తుఫాను ప్రభావం, ప్రజల భద్రతకు సంబంధించి గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావం ఉన్న 28 ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా వర్షాల వల్ల రహదారులు, చెట్లు లేదా ఇతర సమస్యలు ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సూచించారు.

కొరిటెపాడు(గుంటూరు): రానున్న ధాన్యం కొనుగోళ్ల సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(జీడీసీఎంఎస్‌) చైర్మన్‌ వడ్రాణం హరిబాబు కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవను గురువారం హరిబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు, తూకం, నాణ్యత నిర్ధారణ, నిల్వలు, రవాణా, గోదాములకు తరలింపు, రైతులకు సకాలంలో చెల్లింపులపై చర్చించారు. సివిల్‌ సప్లయ్‌ శాఖతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించా రు. అలాగే రైతులకు ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడం, యాప్‌ ద్వారా పారద్శకంగా విక్రయాలు చేపట్టడం, జీడీసీఎంఎస్‌ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్లు చైర్మన్‌ హరిబాబు తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు చైర్మన్‌ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సమ్మె కారణంగా శాఖల్లో సాధారణ బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసర బ్యాంకింగ్‌ సేవలు కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఖాతాదారులు తమ లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సమ్మె రోజుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే ఏటీఎంలు, బిజినెస్‌ కరస్పాండెంట్‌(బీసీ) పాయింట్లు, ఇతర డిజిటల్‌ బ్యాంకింగ్‌ మార్గాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఖాతాదారులకు అసౌకర్యాం కలగకుండా ముందుగానే అవసరమైన నగదు ఉపసంహరణలు, ఇతర బ్యాంకింగ్‌ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించారు. సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement