ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలి

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

గుంటూరు మెడికల్‌: నిర్మాణానికి ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. సీఎస్‌ఆర్‌ నిధులు రూ.5.27 కోట్లతో మంజూరు చేసిన భవన నిర్మాణ సమగ్ర ప్రణాళికపై జీజీహెచ్‌లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన భవనంలో ఆయా విభాగాల్లో ఉన్న పనిఒత్తిడి ఆధారంగా స్థల కేటాయింపు అవకాశాలు పరిశీలించాలని సూచించారు. భవన నిర్మాణ డిజైన్‌లో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ట్రామా కేర్‌ తో పాటు ఇతర విభాగాల అధిపతులు ఆయా విభాగాల అవసరాలను పక్కాగా రూపకల్పన చేసి భవనంలో ఉన్న విస్తీర్ణం మేరకు ప్రణాళికలు శనివారం నాటికి అందించాలని ఆదేశించారు. భవిష్యత్తు విస్తరణను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రాధాన్యత, ప్రాముఖ్యత గల జీజీహెచ్‌ను వైద్యులు అందరూ టీమ్‌ వర్క్‌తో పనిచేసి పేరు ప్రతిష్టలు పెంపొందించాలన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి మౌలిక వసతుల కల్పనలో శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ సర్జరీ వార్డు పనులు పరిశీలన

స్థానికంగా లభ్యంగా ఉన్న నిధులు రూ.25 లక్షలతో మంజూరు చేసిన ప్లాస్టిక్‌ సర్జరీ వార్డు పనులను జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఎక్కడా వాటర్‌ లీకేజీలు ఉండరాదని ఎ.పి.ఎం.ఎస్‌.ఐ.డి.సి ఇంజనీర్‌ లను ఆదేశించారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని అన్నారు. పారిశుధ్యం నెల రోజుల్లో మెరుగుపడాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా ఓపీ, మరుగుదొడ్లు వద్ద పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దుర్గా ప్రసాద్‌, విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement