నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. శుక్రవారం నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25 వేల మంది విద్యార్థులు ఏకకాలంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ ఘనత సాధించారు. గతంలో 8,750 మందితో ఉన్న రికార్డును అధిగమించడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ఎలియాజ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై భావితరాలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకత వినాయకుడు, మట్టి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


