ప్రొఫెసర్‌ కోటేశ్వరరావుకు గుర్రం జాషువా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ కోటేశ్వరరావుకు గుర్రం జాషువా పురస్కారం

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

27న గుంటూరులో ప్రదానం ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): గుర్రం జాషువా 2026 సాహితీ పురస్కారం ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు అధ్యాపకుడు ప్రొఫెసర్‌ కోయి కోటేశ్వరరావుకు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఉదయం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు జరిగే సాహితీ సభలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వివరించారు. గతంలో సుద్దాల అశోక్‌ తేజ, గోరటి వెంకన్న, చంద్రబోస్‌, కొలకలూరి ఇనాక్‌, కత్తి పద్మారావు, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ఓల్గా వంటి ప్రముఖులకు ఈ పురస్కారం అందించామన్నారు. జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కవితా సమ్మేళనం, 25వ తేదీన దేశభక్తి, అభ్యుదయ పాటల పోటీలు, జాషువా పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ‘దేశంలో విద్య, ఉద్యోగాల పరిస్థితులు– యువత, విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని చెప్పారు. జాషువా పురస్కార సభలో ముఖ్య వక్తగా ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా ప్రజాశక్తి దినపత్రిక డెప్యూటీ ఎడిటర్‌ వి.రాం భూపాల్‌, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జాషువా విజ్ఞాన కేంద్రం ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.భావన్నారాయణ, కార్యదర్శి వి.వి.కె.సురేష్‌, ఎస్‌.పద్మ, కాకుమాను నాగేశ్వరరావు, వై.కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement