నగర ఖాళీల సంస్థ! | - | Sakshi
Sakshi News home page

నగర ఖాళీల సంస్థ!

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

సిబ్బంది నిల్‌.. ఒత్తిడి ఫుల్‌.. అవినీతి హల్‌చల్‌ అవినీతికి ‘ఇన్‌చార్జ్‌’లు

చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ బలి 110 పోస్టుల్లో 64 ఖాళీ.. 46 మందితోనే నెట్టుకొస్తున్న వైనం అదనపు బాధ్యతల మాటున యథేచ్ఛగా సాగుతున్న అవినీతి దందా అక్టోబర్‌ చివరినాటికి స్థానిక ఎన్నికల నిర్వహణపైనా సందిగ్ధం చేరిన నెలకే సెలవుపై అదనపు కమిషనర్‌.. ఇన్‌ఛార్జ్‌ల పాలనలో ఎక్కడి పనులు అక్కడే !

మెడికల్‌ ఆఫీసర్ల సంఖ్య సున్నా

సిబ్బంది నిల్‌.. ఒత్తిడి ఫుల్‌.. అవినీతి హల్‌చల్‌
అవినీతికి ‘ఇన్‌చార్జ్‌’లు

నెహ్రూనగర్‌: రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పాలనను పట్టించుకోని సర్కారు వైఖరితో నగరంలో పౌరసేవలు అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సేవలందించాల్సిన స్థానిక సంస్థను ఖాళీల సమస్య దారుణంగా వేధిస్తోంది. మొత్తం 110 మంజూరైన క్యాడర్‌ పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 46 మంది మాత్రమే విధుల్లో ఉండగా, ఏకంగా 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 58 శాతానికి పైగా పోస్టులను భర్తీ చేయకుండా గాలికొదిలేయడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది.

ఎన్నికల నిర్వహణ ఎలా?

ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్‌ చివరినాటికి నిర్వహించాలని ప్రభుత్వం ముమ్మరంగా యోచిస్తోంది. అయితే కార్పొరేషన్‌లో సిబ్బంది కొరతతో ఈ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా సాధ్యమనేది ఇప్పుడు ‘మిలియన్‌ డాలర్ల ప్రశ్న’గా మారింది. ఉన్న సిబ్బందిని ప్రభుత్వం ఎడాపెడా అదనపు బాధ్యతలతో ముంచెత్తుతోంది. ఓటర్ల జాబితా తయారీ కోసం, బీఎల్‌ఓ డ్యూటీలు, రోజుకో సర్వే చేయమంటూ ప్రభుత్వ ఆదేశాలు, వీటికితోడు నగర ప్రజల రోజువారీ దరఖాస్తులు, రెగ్యులర్‌ డ్యూటీలతో ఉద్యోగులు ఊపిరిసలపక నానా తంటాలు పడుతున్నారు.

ఎస్‌ఈ విధుల్లోకి.. వస్తారా.. రారా?

ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్‌ జి.వెంకటేశ్వర్లు గత రెండు నెలల క్రితం సెలవుపై విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఈఈ సుందరామిరెడ్డి ఇన్‌ఛార్జ్‌ ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో దొంగ టెండర్లు, ‘లెస్‌’ మాయాజాలం సృష్టించి ప్రభుత్వ ఖజానాకు, కార్పొరేషన్‌కు కోట్ల రూపాయల నష్టం చేకూర్చిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఈ వ్యవహారం నగరంలో తీవ్ర దుమారం రేపింది. ఏసీబీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవుపై వెళ్లిన ఎస్‌ఈ తిరిగి విధుల్లోకి చేరతారా లేదా? అన్న అనుమానాలను సిబ్బందే బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 18 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు గాను 13 ఖాళీగా ఉన్నాయి. కేవలం ఐదుగురితో ఇంత పెద్ద నగరంలో రోడ్లు, కాలువల పనులను పర్యవేక్షించడం అసాధ్యంగా మారింది. ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.

చేరిన నెలరోజుల్లోనే లీవ్‌లోకి ఏసీ..

కార్పొరేషన్‌లో కీలకమైన అదనపు కమిషనర్‌ పోస్టు కూడా నిలకడలేకుండా పోయింది. కమిషనర్‌ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అదనపు కమిషనర్‌ ఐ.కిషోర్‌ విధుల్లో చేరిన కొద్దిరోజులకే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. అడిషనల్‌ కమిషనర్‌ (జీఎస్‌డబ్ల్యూఎస్‌) పోస్టు ఇప్పటికే ఖాళీగా ఉంది. డిప్యూటీ డైరెక్టర్‌ వంటి ఉన్నత స్థానాల్లోనూ ఎవరూ లేరు. కీలక అధికారులంతా సెలవులపై వెళ్లడం, పోస్టులు భర్తీ కాకపోవడంతో కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు ఫైళ్ల రూపంలో మూలనపడుతున్నాయి. సంతకాలు పెట్టే దిక్కులేక పాలనాపరమైన అనుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

టౌన్‌ ప్లానింగ్‌ బేజారు..

అక్రమ నిర్మాణాల జోరు అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఖాళీల అడ్డాగా మారింది. ఏకై క టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. 13 టీపీ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులు ఉండగా ఒక్కరూ విధుల్లో లేరు. తొమ్మిది టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల్లో ఏకంగా ఏడు ఖాళీలే. నాలుగు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ పోస్టుల్లో రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి, ఇన్‌ఛార్జ్‌ల అండదండలతో నగరంలో అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగర పాలనను మాత్రం పూర్తిగా గాలికొదిలేసింది.

నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్‌లో మంజూరైన ఐదు మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో ఒక్కరూ పనిచేయడం లేదు. మొత్తం ఐదు పోస్టులూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో ముగ్గురు శానిటరీ సూపర్‌వైజర్‌ పోస్టుల్లో ఒక్కరూ లేరు. 24 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండగా, 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగా ఉన్న కీలక స్థానాల్లో రెగ్యులర్‌ అధికారులను నియమించకుండా, ఉన్న అరాకొర సిబ్బందికే ప్రభుత్వం ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను కట్టబెడుతోంది. అయితే ఈ తాత్కాలిక పాలన నగరంలో అవినీతి దందాలకు రాచబాటగా మారింది. అదనపు పోస్టులను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం,ఫైళ్ల క్లియరెన్స్‌ పేరుతో సామాన్యులను, వ్యాపారులను నిలువునా పిండుకుంటున్నారు. ఎవరిపై నిఘా లేకపోవడం, రేపోమాపో ఇంకొకరు వస్తారనే ధీమాతో విచ్చలవిడిగా ‘ముడుపుల’ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement