గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్‌గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్‌వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్‌వాక్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్‌వాక్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్‌లను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు.
విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్‌ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్‌ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్‌ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు.
మ్యూజికల్ నైట్‌కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి.
ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్‌కు చెందిన పుసులూరి దిలీప్‌కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్‌ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


