నగరంపాలెం: స్థానిక నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొలువైన శ్రీవీరభద్రస్వామి ఆలయ 25వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు పోలీస్ అధికార, సిబ్బంది ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతోపాటు జిల్లా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ బృందంలోని ఐదుగురు వేద పండితులు ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం, కుటుంబాల శ్రేయస్సు, జిల్లా ప్రజల శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వందలాది మందికి అన్నదానం చేశారు. డీఎస్పీలు అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), శంకరయ్య (ఏఆర్) దంపతులు, ఏఆర్ ఆర్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పీఆర్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


