నెహ్రూనగర్: వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) జాతీయ స్థాయిలో సత్తా చాటి ఒకే వేదికపై రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కై వసం చేసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ – 2026’ పోటీల్లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుని ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ’గా గుర్తింపు పొందింది. అలాగే రాష్ట్రస్థాయి వార్డుల కేటగిరీ–2 విభాగంలో నగరంలోని 42వ వార్డు ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అదనపు కార్యదర్శి అమన్‌దీప్ గార్గ్‌ల చేతుల మీదుగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వందలాది నగరాలతో పోటీపడి గుంటూరు నగరం రెండో స్థానంలో నిలవడం నగర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. జీఎంసీ ఇన్‌చార్జి ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ అనిల్‌కుమార్, కోమలి పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో అవార్డులు అందుకున్న కమిషనర్ కె.మయూర్ అశోక్


