పోలీసులకు సవాల్
విసిరిన కిడ్నాపర్
‘ఫోన్ ఆన్ చేస్తే తప్ప
ఏం చేయలేమంటూ..’
బాలిక మిస్సింగ్ ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి
సాక్షిప్రతినిధి, గుంటూరు: తమ చిన్నారిని రక్షించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ తండ్రి మూడు నెలలుగా అధికారులు, అధికారపార్టీ నాయకులు అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి కూతురి ఆచూకీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కిన సంఘటన అందరికీ తెలిసిందే. ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆ బాధ్యతను మరిచిపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారిపై అత్యుత్సాహం చూపి అరెస్టు చేయడం వంటి వాటికి పరిమితమై పోయారు. లా అండ్ ఆర్డర్ గాలికొదిలేశారు. రక్షక భటులే భక్షకులుగా మారి జనాన్ని పీక్కుతింటూ పోలీసు శాఖ ప్రతిష్టను కొందరు అవినీతి ఖాకీలు దిగజారస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన సంఘటనపై హైకోర్టు సీరియస్‌గా స్పందించి పోలీసులను చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు హడావుడిగా సిట్ ఏర్పాటు చేసి వెతుకులాట ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
మూడు నెలలు దాటుతున్నా ఆచూకీ లేదు
గుంటూరు నగరానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక జూన్ 9వ తేదీన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి అదే రోజు సాయంత్రం నగరంలోని పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు అనగా జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను గంజాయి తాగే ఓ యువకుడు (22 ఏళ్లు) కిడ్నాప్ చేశాడనే విషయం బయట పడడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాపర్ నెల్లూరు మొబైల్ షాపులో మొబైల్ కొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో గమనించిన తండ్రి అతని మొబైల్ ఈఎంఐ నంబరుతో సహా పోలీసులకు అందించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసి వదిలేశారు..
మైనర్ బాలికను గంజాయి తాగుతూ కత్తి పెట్టుకుని తిరిగే ఓ జులాయి కిడ్నాప్ చేశాడని జూన్ నెల 11వ తేదీన పోలీసులకు తెలిసినప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉంచి దర్యాప్తు చేశారే తప్ప, కనీసం కిడ్నాప్, పోక్సో చట్టం కింద సెక్షన్‌లు మార్పు చేయని పరిస్థితి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఇన్‌స్ర్ట్రాగామ్‌లో 300 నుంచి 400 మంది వరకు కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరిని పిలిచి విచారించిన పోలీసులు ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చేతులెత్తేశారు. పోలీసులు, బాలిక తండ్రి, వారి బంధువులు కోయంబత్తూరు, పాల్గాడ్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో లాడ్జిల్లో వెతికారు. అయితే వీరి ఆచూకీ ముందుగానే ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నిందితుడు వీరు అక్కడికి చేరుకునే రోజు లాడ్జిలు ఖాళీచేసి వెళ్లిపోతున్నాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడడం, ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా గురువారం కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసు మార్పు చేసి హైకోర్టుకు నివేదించేందుకు నానా తంటాలు పడ్డారు.
పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకున్న నిందితుడు సికింద్రాబాద్‌లో ఉండే తన మేనత్త ఫోన్ నుంచి జూలై 13వ తేదీన ఇన్‌స్ర్ట్రాగామ్ ఓపెన్ చేసి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయినా పోలీసుల్లో చలనం లేకపోవడం దారుణమైన విషయం.
జూన్ 21వ తేదీన సికింద్రాబాద్‌లో వెతికిన పోలీసులు ఇక ఆ తరువాత నిందితుడి ఫోన్ ఆన్ చేస్తే తప్ప, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రాలు దాటి వెళ్లి అమాయకులను అర్ధరాత్రి పూట ఎత్తుకొస్తున్న పోలీసులకు ఓ మైనర్ బాలిక కిడ్నాప్ అయి మూడు నెలలు దాటుతున్నా చలనం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి నుంచి మూడు నెలలుగా పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాలిక తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. బాలిక ఇంటి నుంచి వెళుతూ లక్ష రూపాయల నగదు, బంగారం తీసుకెళ్లినట్లు సమాచారం.


