గుంటూరు జీజీహెచ్ మార్చురీకి మామూళ్ల రోగం
శవాలపై పేలాలు
ఏరుకుంటున్న వైద్య సిబ్బంది
మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం చేయకుండా తాత్సారం
డెడ్ బాడీ తరలించేందుకు మామూళ్లు తీసుకుంటున్న మహాప్రస్థానం వాహన సిబ్బంది
సీసీ కెమెరాలు లేకపోవడంతో
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సిబ్బంది
‘మహా’ దోపిడీ..!
ముట్టచెపితేనే అప్పజెపుతాం..!
‘‘ పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం గుంటూరు జీజీహెచ్‌లో వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు రూ.5వేలుకు పైగా లంచం అడిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసే వైద్యులు రూ. 2వేలు, మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు మహాప్రస్థానం వాహన సిబ్బంది రూ.2వేలు, మృతదేహాన్ని అప్పగించే మార్చురీ సిబ్బంది రూ. వెయ్యికి పైగా లంచం అడిగినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటన కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద జరుగుతున్న తంతే.’’
మృతదేహం అప్పగించాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందే
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లోని శవాగారంలో మామూళ్లు మామూలయిపోయాయి. శవాలపై పేలాలు ఏరుకునే విధంగా తమ ఆప్తులు కోల్పోయి బాధాతప్త హృదయాలతో బంధువులు, కుటుంబ సభ్యులు ఉంటే.. మేం అడిగినంత సొమ్మిస్తే గానీ మృతదేహాన్ని ఇవ్వమంటూ.. కదలనీయమంటూ మార్చురీ సిబ్బంది చెప్పే మాటలు వారికి మరింత బాధ కలిగిస్తున్నాయి. ఎలాగోలా డబ్బులు పోగిచేసి ఇస్తూ.. మృతదేహాలను తమ ఊళ్లకు తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా.. దీనిపై ఆసుపత్రి అధికారులు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సీసీ కెమెరాలు పనిచేయవు
మార్చురీ విభాగంలో గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మృతదేహాలు ఏ సమయానికి మార్చురీకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం ఎప్పుడు చేశారు, ఎప్పుడు మృతదేహాన్ని తరలించారనే విషయాలు సీసీ కెమెరాలు రికార్డయ్యేవి. అంతేకాకుండా మార్చురీలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు సైతం సీసీ కెమెరాల్లో ఆసుపత్రి అధికారులు చూసేవారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు వైద్యులు సకాలంలో చేయడం లేదన్న విమర్శలు వినిపించినప్పుడు మామూళ్లు అడుగుతున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి నిజనిర్దారణ చేసేందుకు ఆసుపత్రి అధికారులకు అవకాశం లేదు. నేడు మార్చురీ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న సీసీ కెమెరా పనిచేయడం లేదు. వెనుక వైపు ద్వారా వద్ద ఉన్న సీసీ కెమెరాలను తొలగించారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారనే విషయాలపై ఎవరికి అజమాయిషీ లేకుండా పోతుంది.
మధ్యాహ్నం తరువాతే పోస్టుమార్టం
మార్చురీలో మెడికో లీగల్ కేసులకు (ఎంఎల్‌సీ) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోస్టుమార్టం చేయాలని సమయాలను నిర్ధేశించారు. కాని జీజీహెచ్ మార్చురీలో మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకు ఒక్క పోస్టుమార్టం కూడా చేయరు. పోలీసులు వచ్చి తమకు పంచానామాలు అందించలేదని, అందువల్లే జాప్యం అవుతుందంటూ వైద్యులు బుకాయిస్తున్నారు. నిర్ణీత సమయానికి వైద్యులు రాకుండా సొంత వ్యవహారాల్లో తిరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చురీలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవడంతో తమ ఉద్యోగంపై ఎలాంటి భయాందోళనలు లేకుండా ఇష్టానుసారంగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహాప్రస్థానం వాహనం ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించాల్సి ఉండగా, వారు కూడా ప్రతి ట్రిప్పునకు రూ. 2వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు అంబులెన్సుల్లో తరలిస్తే రూ.10వేల నుంచి రూ. 20వేలకుపైగా డబ్బులు తీసుకుంటారని, వాహనం క్లీన్ చేసుకునేందుకు, తమకు భోజనం ఖర్చుల కోసం మంటూ రూ.2వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడుతున్నా ఆసుపత్రి అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. మరోపక్క వైద్యులు మార్చురీని కార్‌పార్కింగ్‌లా మార్చేసి తమ సొంత వాహనాలను ఎన్నడూ లేని విధంగా మార్చురీలోనే పార్కింగ్ చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి మార్చురీలో జరుగుతున్న మామూళ్ల రోగానికి చికిత్స చేసి వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు మెరుగు పడేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
పోస్టుమార్టం చేసేందుకు వైద్యులకు, పోలీసులకు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలంటూ కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. తమకు కూడా ఎంతోకొంత ముట్టజెబితేనే సత్వరం పోస్టుమార్టం చేసేందుకు ముందుకు వస్తున్నారు. లేని పక్షంలో పలు కారణాలు చెప్పి జాప్యం చేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతూ త్వరితగతిన పోస్టుమార్టం చేయాలంటూ మామూళ్లు ముట్టచెబుతున్నారు.


