గుంటూరు మిర్చి యార్డులో లైసెన్సుల దందా కొత్తగా 70కి పైగా కావాలని పాలకవర్గం సిఫార్సు వాటాలు పంచుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పాలకవర్గం గత మే నెలలో 47 నూతన లైసెన్సులకు ఆమోదం ఒక్కొక్కటి రూ.30 లక్షలకు అమ్ముకున్న అధికార పార్టీ నేతలు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు బేరసారాలు లైసెన్సుల ఫైల్ క్లియర్‌కు చినబాబుతో ఒత్తిడికి యత్నాలు
రైతుల సంక్షేమం గాలికి...
పేరుకే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డు.. రైతులకు అన్ని వసతులు కల్పించి, వారి సంక్షేమాన్ని చూడాల్సిన మిర్చి యార్డు పాలకవర్గం వ్యాపారులకు దాసోహమైంది. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ధనార్జనే ధ్యేయంగా లైసెన్సుల దందాకు దిగుతున్నారు. యార్డుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మిర్చి విక్రయించేందుకు రైతులు వస్తుంటారు. వారికి సరైన ధర రాకపోయినా, మిర్చి ఆరబెట్టుకునేందుకు కనీస వసతులు కల్పించకుండా పాలక మండలి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గం మారిన ప్రతిసారీ లైసెన్సులు పంచుకుని అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడూ ఇదే దందా కొనసాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాలకమండలి సభ్యులు జేబులు నింపుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో ఇప్పటికే ఆరు వందలకుపైగా మిర్చి కమీషన్ షాపులు ఉన్నాయి. వాటిని ఇంకా పెంచాలంటూ పాలక మండలి సిఫార్సులు చేయడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పాలక మండలి సభ్యులు ఇలా అందరూ ఏకమై వాటిని అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న కమీషన్ షాపుల్లో సగం మంది కూడా సక్రమంగా వ్యాపారం చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా కమీషన్ షాపుల లైసెన్సుల పేరుతో జేబులు నింపుకొనేందుకు అధికార పార్టీ నేతలు ఆరాటపడుతుండటం వారి ధనదాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరో 70కి పైగా వచ్చేలా..
ఈ ఏడాది మే నెలలో కొత్తగా 47 షాపులకు లైసెన్సులు ఇచ్చారు. వాటి మంజూరు సమయంలో అప్పటి పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి వీటిపై విచారణ జరపాలని అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఇదంతా అధికార పార్టీ ముఖ్యనేతకు తెలిసే జరిగిందని విమర్శలు వినిపించాయి. ప్రస్తుత పాలకవర్గంతోపాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారులకు సైతం లైసెన్సుల్లో వాటాలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన 47 లైసెన్సుల్లోగానీ, ప్రస్తుతం వీరు సిఫార్సు చేస్తున్న 70కి పైగా లైసెన్సుల్లోగానీ నిజంగా వ్యాపారం చేసేవారు ఎంత మంది అనేదానిపై విచారణ జరిపితే నిజాలు బయటకొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో 47 లైసెన్సుల మంజూరు సమయంలో ఫిర్యాదులు చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఈసారి 70కి పైగా లైసెన్సుల కోసం సిఫార్సులు చేసినా మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం చేసుకోవచ్చని సొంత పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. ఒక్కో లైసెన్సుకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గతంలో వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కొత్తవాటికి ఇప్పటికే బేరసారాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని గ్రహించిన పాలక మండలి సభ్యులు, అధికార పార్టీ నాయకులు లైసెన్సుల కోసం పెద్ద స్థాయిలోనే పైరవీలు చేస్తున్నారు. వీటిలో ఎవరి వాటా ఎంత అనే ఒప్పందానికి ఇప్పటికే వచ్చారని చెబుతున్నారు.
ఐదు ఔట్ సోర్సింగ్ పోస్టులకూ..
అంతేకాకుండా యార్డులో ఐదు ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఇప్పటికే బేరసారాలు చేసుకుని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఒక్కో కారం మిల్లు నుంచి ఓ ముఖ్యనేత రూ.50 లక్షలు డిమాండ్ చేయగా, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. కారం మిల్లుల్లో తనిఖీలు చేపట్టకుండా ఉండేందుకే ఇంత భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త లైసెన్సు జారీకి చినబాబుతో ఒత్తిడి చేయించుకునేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మిర్చి యార్డులో మిర్చి బస్తాలు (ఫైల్)
గుంటూరు మిర్చి యార్డుకు ఏటా వేల సంఖ్యలో రైతులు మిర్చిని విక్రయించుకునేందుకు వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు మిర్చి యార్డులో కనీస వసతులు గానీ, మిర్చి అమ్ముడు పోకపోతే బస్తాలు నిల్వ ఉంచుకునేందుకు స్థలం గానీ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాపారులను ప్రసన్నం చేసుకుని వారి నుంచి డబ్బులు గుంజడం తప్ప, రైతుల ఇబ్బందులు తీర్చాలనే కనీస ప్రయత్నాలు కూడా ప్రస్తుత పాలకవర్గం చేయడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల నుంచి పాలక మండలిని ఎన్నుకుంటే రైతుల కష్టాలు తెలుస్తాయని, అలాకాకుండా రాజకీయ నేతల అండదండలతో పాలకవర్గం ఏర్పడితే రైతుల పరిస్థితి ఇలానే ఉంటుందని విమర్శిస్తున్నారు.


