సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భారీ అవినీతి
సిమెంట్, తారుకు బదులు ప్లాటినం, బంగారం పొదుగుతున్నారా?
మాజీ మంత్రి అంబటి రాంబాబు
నెహ్రూ నగర్ (గుంటూరు ఈస్ట్): అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ప్రజాధనాన్ని దోచుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అమరావతి ప్రజా రాజధాని కాదని, అది ముమ్మాటికీ టీడీపీ అవినీతి సామ్రాజ్యం, చంద్రబాబు కుటుంబం దోపిడీ రాజ్యమని మండిపడ్డారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి సీడ్ నుంచి జాతీయ రహదారిని కలిపే 21.77 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.1,519 కోట్లు కేటాయించిందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిలోమీటర్‌కు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. జాతీయ రహదారుల సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రోడ్లకు సగటున కిలోమీటర్‌కు రూ.23 నుంచి రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకు కిలోమీటర్‌కు దాదాపు రూ.180 కోట్ల వరకు వెచ్చించడం ఏమిటని అంబటి ప్రశ్నించారు. నాణ్యతా లోపంతో గతంలో కుంగిపోయిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జికి రూ.80 కోట్లతో మరమ్మతులు చేసి ప్రారంభోత్సవాల పేరిట చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విడ్డూరమైన రేట్లు అమరావతిలో కనిపిస్తున్నాయన్నారు. అమరావతిలోని రోడ్లు, భవనాల్లో సిమెంట్, తారుకు బదులు ప్లాటినం, బంగారం పొదుగుతున్నారా? అని ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు నేటికీ కనీసం ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ సిద్ధం చేసి ప్లాట్లు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రూ.వేల కోట్లు దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.57 వేల కోట్ల అప్పులు తెచ్చారని, మరో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి 50 శాతం స్వాహా చేయడానికి తండ్రీ కుమారులు స్కెచ్ వేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలు, తాత్కాలిక బ్రిడ్జిలే మినహా శాశ్వత నిర్మాణాలు లేవని, మంత్రులు సైతం అక్కడ ఉండకుండా బయటే నివసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ భారీ దోపిడీని చూసే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టారని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వచ్చి ఈ దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.


