విజయకీలాద్రిపై శ్రావణమాస మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై శ్రావణమాస మహోత్సవాలు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

విజయకీలాద్రిపై శ్రావణమాస మహోత్సవాలు అగస్త్యేశ్వర స్వామికి బంగారు హారం కానుక ‘పీజీఆర్‌ఎస్‌’ రీ ఓపెన్‌ అర్జీలు పరిశీలించిన జేసీ డిప్లమో కోర్సులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌

తాడేపల్లి రూరల్‌: పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంలో ఆగష్టు 13 నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు ఈ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం గావించామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు గోదా అమ్మవారికి అభిషేక మహోత్సవం, మహాలక్ష్మి, వీరలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, చామంతి పూలతో సహస్ర నామార్చన కనుల పండువగా నిర్వహించామని తెలిపారు. అనంతరం గోదా అమ్మవారికి, మహాలక్ష్మి వీరలక్ష్మి అమ్మవార్లకు సారె సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారని పేర్కొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

కాకుమాను: గుంటూరు జిల్లా కాకుమానులోని అగస్త్యేశ్వర స్వామికి హైదరాబాద్‌కు చెందిన కోమటినేని రాహుల్‌ వంద గ్రాముల బంగారు హారం శుక్రవారం సమర్పించారు. ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాక దాతకు తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థాన అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు.

నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందిన రీ ఓపెన్‌ అర్జీలను జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. బాధ్యతాయుతంగా స్పందిస్తూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులకు తగిన సూచనలు చేశారు.

రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయండి

జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్‌ సంజనా సింహ సంబంధిత అధికారులు ఆదేశించారు. శుక్రవారం చిలకలూరిపేట మండలం స్వర్ణ గ్రామం యడవల్లి గ్రామంలో రీ సర్వే పనులను పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఏడీ ల్యాండ్‌ అండ్‌ సర్వే డిపార్టుమెంట్‌, చిలకలూరిపేట తహసీల్దార్‌, అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు రూరల్‌: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే మాన్యువల్‌ మాప్‌ అప్‌, స్పాట్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం ప్రారంభించారు. వీసీ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులకు మాన్యువల్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించగా, శుక్రవారం ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న, రిజిస్టర్‌ చేసుకోని అభ్యర్థులందరికీ మాన్యువల్‌ మాప్‌ అప్‌, స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మణి, వ్యవసాయ కళాశాలల డీన్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీనివాసరావు, వ్యవసాయ ఇంజినీరింగ్‌ డీన్‌ డాక్టర్‌ పి.వి.కె. జగన్నాథరావు, పాలిటెక్నిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సి.వెంకటేశ్వర్లు, జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement