డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ఓవరాల్ చాంపియన్ ఎన్నారై మెడికల్ కళాశాల
అమరావతి క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులు ఎల్‌అండ్‌టీకి అప్పగింత
ఎస్‌ఐ నుంచి రక్షించాలంటూ ప్లకార్డుల ప్రదర్శన
గుంటూరు మెడికల్: తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్ నుంచి ప్రారంభమై గుంటూరు మెడికల్ కాలేజ్, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పట్టాభిపురం, గుజ్జనగుండ్ల సెంటర్, విద్యానగర్, కొరిటెపాడు, లక్ష్మీపురం, అరండల్‌పేట మీదుగా గుంటూరు జీజీహెచ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎనిమిది నెలలుగా స్టయిఫండ్ పెంపు గురించి వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూడాల సంఘం నేతలు తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ వరకు ఓపీ, ఐపీ సేవలు మాత్రమే నిలిపి వేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 16 నుంచి అత్యవసర సేవలు బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. ప్లకార్డులు చేతపట్టుకుని సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వారు నినాదాలు చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.ఈశ్వర్‌శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, పి.ఎస్.వి.కల్యాణి, విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి.వంశీకష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్ కార్తిక్, నిషిరాగ్ బికుంతె, పి.సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు ఎన్.సాయిప్రదీప్, ఉదయ్‌సాగర్, సాయిప్రదీప్, తరుణ్‌కుమార్, హేమంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్: వైద్య విద్యార్థుల్లో దాగివున్న కళా ప్రతిభను వెలుగుతీయటంతోపాటు వారిలో టీం స్పిరిట్, సృజనాత్మక పెంపొందించడమే కల్చరల్ మీట్ ప్రధాన ఉద్దేశం అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని చిన్న కాకాని గ్రామంలో ఉన్న ఎన్నారై మెడికల్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న మోడరన్ మెడికల్, డెంటల్ కళాశాల విద్యార్థుల ఇంటర్ కాలేజీ మీట్, కల్చరల్ మీట్ వేడుకలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజ్ జనరల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య విద్యార్థులు పురుషులు, మహిళలు విభాగాలలో ఓవరాల్ చాంపియన్ నిలిచారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజ్ జనరల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహక బృందాన్ని అభినందించారు. హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయిసుధీర్‌కు మెమోంటోను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ సోము కృష్ణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేక గౌరవ అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్, సీనియర్ సైక్రియాటిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, అంతర్జాతీయ మిమిక్రీ ఆర్టిస్ట్ జే రమేష్, గీత రచయిత రెహమాన్, ఇండియన్ ఐడల్ ఫ్రేమ్ అనిరుద్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ సోము కృష్ణమూర్తి, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ మనీ అక్కినేని, ఫౌండర్ డైరెక్టర్స్ డాక్టర్ ఉపేంద్రనాథ్ నిమ్మగడ్డ, పోలవరపు రాఘవరావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీఎస్ కుమార్ చౌదరి, కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
నగరంపాలెం: ఎస్‌ఐ నుంచి రక్షించాలంటూ బాధితులు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మమ్మల్ని కాపాడాలని, మాకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నినదించారు. బాధితులు తెలిపిన బాధితుడు పి.శ్రీనివాసరావు అందించిన వివరాలు.. దుగ్గిరాల మండలం పెదకొండూరు జనార్ధన్‌సెంటర్‌లో 11 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నట్లు చెప్పారు. కొడుకులు ఇద్దరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఈనెల ఐదున బయట వ్యక్తులతో ఇంటి వద్దకు వచ్చి తమపై మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. తనతో పాటు మేనల్లుడు మట్టా రాజా, సాయికృష్ణ, ఉదయ్‌కుమార్‌లకు గాయాలైనట్లు పేర్కొన్నారు. తెనాలి జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నామని వివరించారు. ప్రస్తుతం సాయికృష్ణ మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, ఉదయ్‌కుమార్ తెనాలి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ విషయంపై దుగ్గిరాల పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎస్‌ఐ అవతలి వ్యక్తులకు వత్తాసుగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. అంతేగాక తమపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. ఈనెల మూడున జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లోనూ ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. అయినప్పటికి తమకు న్యాయం జరగలేదని వాపోయారు.
తాడికొండ: రాజధాని అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో నిర్మించనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ట్విన్ ఆఫీస్ టవర్స్(టి1 – టి2) నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థకు ఏజీఐసీఎల్ అప్పగించింది. ఈ మేరకు ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులకు పనుల అప్పగింతకు సంబంధించిన పత్రాలను అందజేశారు. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం అమరావతిలో ఆధునిక సాంకేతికత, క్వాంటమ్ కంప్యూటింగ్, భవిష్యత్ కార్యాలయ మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.


