రైతులపై ఎరువు ధరవు | - | Sakshi
Sakshi News home page

రైతులపై ఎరువు ధరవు

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

యంత్రాలపైనా అంతే..

సాగు ఖర్చు తడిసి మోపెడు భారీగా పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కౌలు రైతులపై పెనుభారం సాగు యంత్రాల వినియోగంపైనా ఖర్చుల వడ్డింపుతో విలవిల అదనపు వ్యయాలతో అప్పులపాలు ధరల నియంత్రణపై స్పందించని చంద్రబాబు సర్కారు

అడ్డగోలుగా దోపిడీ..

చంద్రబాబు పాలనలో దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు

కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు

భారంగా మారిన సాగు

కొరిటెపాడు(గుంటూరు): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే పడింది. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అన్నదాతలు ఆందోళనలో మునిగారు. జిల్లాలో నైరుతి రుతుపవనాల కారణంగా ఆశించిన వర్షం కురవలేదు. అక్కడక్కడా వానలు పడుతుండటంతో ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రణాధారమైన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.600 వరకు పెంచేయడంతో ఊహించని ఖర్చుతో భారం తడిసి మోపెడవుతోంది.

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సాగును మరింత భారంగా మార్చాయి. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగించే 90 శాతం యంత్రాలు డీజిల్‌తోనే నడుస్తున్నాయి. దుక్కి దున్నే ట్రాక్టర్‌ మొదలు పంట నూర్పిడి యంత్రాలు, ఎరువులు, వంటల రవాణాకు వినియోగించుకునే ఆటోలు, ట్రాక్టర్లకు డీజిల్‌ కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ట్రాక్టర్ల అద్దె, విత్తనాలు, ఎరువుల రవాణా ఖర్చులు, పంట కోత యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు ఈ ఏడాది ఎల్‌నినో భయం కూడా వెంటాడుతోంది. వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతను కలవర పెడుతున్నాయి. వర్షాధార పంటలైన వరి, పత్తి, మొక్క జొన్న తదితర పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. పాలన గాలికి వదిలేసిన సర్కారు, ఎరువుల పంపిణీలో పర్యవేక్షణ కూడా చేయడం లేదు.

అన్నదాతల ఆక్రందన..

‘పంట వేస్తే ఎరువులు దొరకవు. దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు’ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి, ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసి, కాంప్లెక్స్‌ ఎరువల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారికి పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.

అన్నదాతకు సాగు నానాటికీ కష్టంగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుతో వారికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క బాధపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఎరువులు, సాగు యంత్రాలను అద్దెకు తెచ్చుకుంటే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అక్కడా అడ్డగోలుగా పెంచేశారు. పరిస్థితిని నియంత్రించడానికి సర్కారు కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతుల విషయంలో ఉదారతతో వ్యవహరించాల్సింది పోయి ధరలు పెంచడం సరికాదు. కౌలు రైతులు వ్యవసాయం మానేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులపై ఈ ధరల పెంపు పెనుభారంగా మారింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలు తగ్గించాలి.

–కంచుమాటి అజయ్‌కుమార్‌, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, గుంటూరు

మద్దతు ధర లేక గత పంటలు ఇంకా ఇళ్లలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సాగుకు సిద్ధమవుతుంటే, ఎరువుల ధరలు అమాంతం పెంచి మాపై అదనపు భారం మోపారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వాలు... ఇలా ధరలు పెంచి నడ్డి విరవడం ఏమాత్రం సమంజసం కాదు. ఇకనైనా అన్నదాతలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి.

– తూము వెంకటస్వామిరెడ్డి,

గుంటూరు, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement