మూలాంకురేశ్వరికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

మూలాంకురేశ్వరికి విశేష పూజలు

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

మూలాంకురేశ్వరికి విశేష పూజలు శాకంబరి వారాహి మాతగా బగళాముఖి

ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్‌ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్‌శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాకంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

20న జగన్నాథ రథయాత్ర

తెనాలి టౌన్‌: ఇస్కాన్‌ టెంపుల్‌ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్‌చార్జి సింహ గౌరదాస్‌ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్‌లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్‌, గాంధీచౌక్‌, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్‌ రోడ్డు, మెయిన్‌ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్‌, గోపాలకృష్ణ, కార్తీక్‌ తదితరులున్నారు.

దుర్గమ్మకు ఆషాఢ సారె

మంగళగిరి టౌన్‌: పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్‌ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement