న్యూస్‌రీల్
పిడుగురాళ్ల ప్రభుత్వ కళాశాల, వైద్యశాల ముఖ ద్వారం
నెరవేరిన జగనన్న సంకల్పం
పిడుగురాళ్ల: పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి గతంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం పల్నాడు జిల్లాకే మణిహారంగా మారింది. బడుగు, బలహీన వర్గాలు, పేదలకు వైద్యంతోపాటు పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మించారు. ఈ ప్రాంతం ప్రజల కల వైఎస్ జగన్ సహకారంతో సాకారం అయిందని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు 2026–27 విద్యా సంవత్సరానికి కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాసుపత్రి, తరగతి గదులు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధమైనట్లు వైద్య బృందం తెలిపింది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ...
పల్నాడు జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఈ వైద్య కళాశాల ఎంతో ఉపయోగపడనుంది. వైద్యులు, బోధన సిబ్బంది, ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం దక్కింది. పరోక్షంగా ఎంతో మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య పెరగటంతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావటం మాజీ ముఖ్యమంత్రి జగన్ చలవేనని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముందుచూపు ఫలితమే నేడు పిడుగురాళ్ల వైద్యశాల, వైద్య కళాశాల రూపకల్పనకు కారణమైంది.
గతంలోనే 90 శాతం పూర్తి
జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రత కోసం చేపట్టిన కళాశాల నిర్మాణం 90 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల కూడా ప్రారంభం కానుండటంతో వంద సీట్లు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టమని ఎన్‌ఎంసీ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాల, వైద్యశాల నిర్మాణం శరవేగంగా చేసేందుకు అప్పటి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చూపిన చొరవను ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే కాసు ప్రత్యేక ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిసరాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం, విద్య అందించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించారు. అందులో భాగంగా పిడుగురాళ్లలో వైద్య కళాశాల పనులు చేపట్టి దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. నేడు ఆ కళాశాల ప్రారంభమవడమే కాకుండా తాజాగా ఎంబీబీఎస్ సీట్లు కూడా పొందింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యశాల కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


