తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సంప్రదింపులు జరపకుండా వారి నుంచి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు అన్నారు. ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ ప్రాంతాన్ని ఆయన స్థానిక సీపీఎం నాయకులతో కలసి సోమవారం పరిశీలించారు. అనంతరం సీపీఎం కార్యాలయంలో బాబూరావు మాట్లాడుతూ.. ఇక్కడి రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా అని ప్రశ్నించారు. చట్టాలను లెక్కచేయకుండా, కోర్టులో వివాదం నడుస్తుండగా, కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మహిళలను విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని లాగివేయడం సరికాదన్నారు. రూ.ఆరేడు కోట్ల విలువ చేసే విలువైన భూములను రిజిస్ట్రేషన్ వాల్యూ తెలీకుండా ఆర్డరు ప్రకటించడం దుర్మార్గమన్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నామంటూ 9.3 అంగీకారం తెలిపినా, రైతుల భూముల్లో దౌర్జన్యంగా మట్టి వేశారన్నారు. మాట తప్పింది ప్రభుత్వమేనని, రైతులు కాదని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యులు, మంత్రి లోకేశ్ నోరు మెదపడంలేదని విమర్శించారు.
పవన్ ఎందుకు మాట్లాడరు?..
ఇక ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల భూములు బలవంతంగా తీసుకుంటే జనసేన చూస్తూ ఊరుకోదని చెప్పిన పవన్‌కళ్యాణ్, నేడు పేదల భూముల లాక్కుంటుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రెండవ దశలోని 43 గ్రామాల్లో 1,43,000 ఎకరాలు భూసేకరణ చేస్తామనడం దుర్మార్గమన్నారు. రాజధాని అంటే పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, నాయకులకేనా, రైతుల గోడు పట్టదా అని బాబురావు మండిపడ్డారు.


