తెనాలి: ప్రముఖ తెలుగు భాష, వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ చావలి సద్యోజాతం(77) అనారోగ్య కారణంతో సోమవారం స్థానిక ఈటీ కాలనీలోని స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సద్యోజాతం తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా గుర్తింపు పొంది, శిశు విద్యామందిర్‌లో పదేళ్లు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987–2012 వరకు కిన్నెరసాని, ఏనుకూరు, శ్రీశైలంలోని ఏపీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు వంశపారంపర్యంగా వస్తున్న శైవ ఆగమంలో పాండిత్యం సంపాదించడంతోపాటు వాస్తుశాస్త్రంలో మంచి పరిజ్ఞానాన్ని పొందారు. వాస్తు సమస్యలపై సదస్సులు నిర్వహించారు. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సలహా మండలి సభ్యుడిగా వ్యవహరించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, రామలింగేశ్వరరావు, మేడూరు శ్రీనివాసమూర్తి, ఈఎల్‌వీఅప్పారావు, జెట్టి అరుణ, గాలి సత్యనారాయణ, సామ్రాజ్యం, సుశీల వర్ధని, కృష్ణకుమారి, ఉమాదేవి, పలువురు ఆదిశైవ సంఘం, అర్చక సమాఖ్య, అర్చక సేవా సంఘం ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.


