పెదకాకాని: శివాలయంలో ఆరుద్ర నక్షత్రం. కృష్ణ చతుర్దశి మహా పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన పూజా కార్యక్రమాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. మాస శివరాత్రి రోజున భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో అంతరాలయ అభిషేకాలు, ఏక వారాభిషేక పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు, రాహుకేతు పూజలు అధికసంఖ్యలో జరిగాయి. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఒక్క రోజులో స్వామి వారికి రూ.4 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, పూజలు చేశారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ వరప్రసాద్ కూడా స్వామి వారిని దర్శించుకుని, అభిషేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు ఆయన్ను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. వేద ఆశీర్వచనం చేశారు.


