ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

ప్రజలు కోరిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలి రేపటి నుంచి వారాహి నవరాత్రి మహోత్సవాలు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఈడీ తనిఖీలు శివాలయానికి పోటెత్తిన భక్తులు

– ఆర్టీఐ కమిషనర్‌ శ్రీనివాసరావు

అచ్చంపేట: ప్రజలు కోరిన సమాచారం అందుబాటులో ఉంటే వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అచ్చంపేట తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. సహ చట్టం రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్నింటికి సమాచారం అందించారనే విషయాలను పరిశీలించారు. అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రతి సమాచారం పబ్లిక్‌కు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ఆయన వెంట సత్తెనపల్లి ఆర్డీవో గోపాలకృష్ణ, తహసీల్దారు సరోజ, డిప్యూటీ తహసీల్దారు జానీబాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రి మహోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కె.చక్రధరరెడ్డి తెలిపారు. సోమవారం 90వ అమావాస్య దివ్యహోమం సందర్భంగా అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలలో దేవతారూపం లేకుండా కేవలం చక్ర రూపంలో గయా క్షేత్రంలో మాత్రమే దర్శనమిచ్చే శ్రీమాధవేశ్వరి మహామాత అలంకరణలో పూజలు చేశారు. అమావాస్య సందర్భంగా ఆలయంలో జరిగిన హోమం, విశేష పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పట్నంబజారు: ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం నెల్లూరు జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ (ఈడీ) జి.నాగేంద్రప్రసాద్‌ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) డి.సాంబ్రాజ్యంతో క లసి డిపో–1 గ్యారేజీని పరిశీలించారు. బస్సుల మరమ్మతుల పనులను పరిశీలించారు. గుంటూరు డిపో–2లో జరుగుతున్న ఎలక్ట్రికల్‌ బస్సుల గ్యారేజీ పనుల గురించి ఆరా తీశారు. ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహా శైవాక్షయోగం రోజున శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేయడం వలన వంద మహాశివరాత్రులు ఆచరించిన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు, అర్చకులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement