గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే ముందు నిబంధలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల సంఘ (అప్సా) రాష్ట్ర కో–చైర్మన్ మేకల రవీంద్రబాబు పేర్కొన్నారు. గురువారం అప్సా ప్రతినిధులు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను కలసి వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రవీంద్రబాబు, అప్సా రాష్ట్ర కోశాధికారి చెరుకూరి శ్రీహరి మాట్లాడుతూ గుంటూరు నగరంలో కొత్తగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో మూడు కిలోమీటర్ల పరిధిలో మరో పాఠశాల ఉండరాదనే నిబంధనలు పాటించడం లేదని అన్నారు. వివిధ ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖ నుంచి అనుమతులు పొందకుండా కొనసాగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సరీ నుంచి యూకేజీ వరకు అనుమతి తీసుకుని 5వ తరగతి వరకు విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారని, పలు పాఠశాలలు కనీసం ఎన్‌ఓసీ సైతం లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని డీఈవో దృష్టికి తెచ్చారు. అడ్మిషన్ల కోసం ఇతర పాఠశాలలపై దుష్ఫ్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవోను కలసిన వారిలో అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సాధినేని మురళి, తూర్పు, పశ్చిమ డివిజన్ల అధ్యక్షులు చింతల భానుప్రసాద్, నర్రా రాజేష్, కార్యదర్శి రుక్సార్ అహ్మద్, శ్రీనాధ్, ఎస్. నాగేశ్వరరావు ఉన్నారు.
అప్సా రాష్ట్ర కో–చైర్మన్ మేకల రవీంద్రబాబు


