అభివృద్ధి పనులపై సమగ్ర ప్రణాళికలు సమర్పించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులపై సమగ్ర ప్రణాళికలు సమర్పించాలి

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

ఎల్‌నినో ప్రభావం...

ఎండ తీవ్రతపై సూచనలు

గుంటూరు వెస్ట్‌: నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, శాఖల వారీగా వివరాలకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిపాదించిన పనుల వాస్తవ వివరాలు, పకడ్బందీగా నివేదికలను స్వయంగా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూపొందించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న కలెక్టర్ల సమీక్షలో పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వివరాలు సమర్పించాలన్నారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో కొండవీటి వాగుపై నిర్మించనున్న హైలెవల్‌ బ్రిడ్జి, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సీఆర్డీఏ అధికారుల సమన్వయంతో రూపొందించాలన్నారు. ప్రతిపాదిస్తున్న పనులకు పూర్తి జస్ట్టిఫికేషన్‌ వివరాలు, మ్యాప్‌లు, ఫొటోలతో ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గాలవారీగా ప్రజెంటేషన్‌ వివరాలు శుక్రవారం సాయంత్రం నాటికి అందించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గుంటూరు చానల్‌, గుంటూరు నల్లమడ, ఇతర పంట కాలువల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సాగు భూముల ఆయకట్టు తదితర పూర్తి వివరాలతో రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో ఎ. గంగరాజు, తెనాలి ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్‌ లక్ష్మీకుమారి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ వెంకటరత్నం, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి. రంగారావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ కె.కల్యాణ చక్రవర్తి, డీపీఓ నాగ సాయికుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావసరాలను గుర్తించి పనిచేయాలి

ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ అతుతోష్‌ శ్రీవాస్తవతో కలసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ దరఖాస్తులను నాణ్యతతోపాటు 12 గంటల్లో పరిశీలించాలన్నారు. దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏకి వెళితే సంబంధిత అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు. జనగణనపై జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని చెప్పారు. శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వారిపై చర్యలు చేపడతామన్నారు. డయేరియా ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని హీమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. గుంటూరులో ఏప్రిల్‌ 17న విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో వాకథాన్‌, అవగాహన ర్యాలీలు, వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వలన ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున కార్మికులు, వేతనదారుల పనివేళల పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని, సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా చూడాలని అన్నారు. పనిప్రదేశాలల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, గంగరాజు, వైద్యశాఖాధికారి డాక్టర్‌ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement