న్యాయం చేసే వరకు పోరు | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేసే వరకు పోరు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

70 సంవత్సరాలుగా నివాసం

విలపించిన బాధితులు

వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా

మోతీలాల్‌ నగర్‌ బాధితులకు మద్దతు ప్రకటన

ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యానికి ఇదే నిదర్శనం

సహాయం కోరితే చచ్చిపొమ్మన్నట్లు ఆరోపణ

ఇళ్లు కోల్పోనున్న బాధితుల తీవ్ర ఆవేదన

ప్రత్యామ్నాయం చూపాలి

పేదలపై ఇంత కోపమెందుకు?

న్యాయం చేస్తే వెళ్లిపోతాం

గుంటూరు వెస్ట్‌: పేదలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకై నా పోరాడతామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా పేర్కొన్నారు. 56వ డివిజన్‌ పరిధిలోని మోతీలాల్‌ నగర్‌ (నెహ్రూనగర్‌ జీరో లైన్‌)లో నివాసముంటున్న బాధిత కుటుంబాల కోసం ఆమె వారిని వెంటబెట్టుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మను కలిశారు. పేదల సమస్యను ఆయనకు వివరించారు. తగిన న్యాయం చేయాలని బాధితులతో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం విలేకరులతో నూరి ఫాతిమా మాట్లాడుతూ.... సుమారు 70 ఏళ్లుగా దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. రైల్వే అధికారులు బాధితులకు పదే పదే నోటీసులు పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూలుస్తామనడం దారుణమని పేర్కొన్నారు. కూలీ నాలీ చేసుకుని జీవించే పేదలపై ప్రభుత్వానికి ఇంతటి కోపమెందుకని ప్రశ్నించారు. గుంటూరులో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను అధికార యంత్రాంగం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నిలువ నీడ కోల్పోతున్న బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ను కలిస్తే, కనీసం కనికరం లేకుండా ‘చస్తే చావండి‘ అంటూ దుర్మార్గమైన మాటలు మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రజలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అర్ధాంతరంగా ఇళ్లను తొలగిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారని తెలిపారు. పేదలను రోడ్డున పడేసే చర్యలను వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యామ్నాయ వసతి లేదా ఇళ్లు కేటాయించిన తర్వాతే ఇక్కడ తొలగింపు చర్యలు చేపట్టాలని నూరి ఫాతిమా స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎర్రబాబు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కేసరి శుభ, జిల్లా వలంటీర్‌ విభాగం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధితుల తరఫున కలెక్టరేట్‌ ఆవరణలో నూరి ఫాతిమా మాట్లాడుతున్న సమయంలో బాఽధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కూలి పనులు చేసుకుని జీవిస్తున్న తమపై ప్రభుత్వంతోపాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ కక్ష కట్టారని ఆరోపించారు. అండగా ఉంటారని ఓట్లు వేసి గెలిపిస్తే తమను ‘చస్తే చావండి’ అని అంటున్నారని వాపోయారు. తాము ఓటు వేసి గెలిపించిన పాపానికి ఇళ్లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును అధికారంలోని వారు పట్టించుకోవడం లేదని వాపోయారు.

చంద్రబాబు సర్కారు మా కష్టాలను తీరుస్తుందని అనుకున్నాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. 70 ఏళ్లుగా నివాసముంటున్న ప్రాంతం నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. అభివృద్ధి కోసం మేం వెళ్లిపోయేందుకు సిద్ధమే. అయితే ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యంగా ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ తీరు మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. సాయం చేయకపోగా చస్తే చావమంటున్నారు. ఇది చాలా దారుణం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమకు అండగా ఉండి పోరాడటంతో ధైర్యంగా వచ్చింది.

– ఆనంద పాల్‌, స్థానికుడు

చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనేది భ్రమే. కొన్ని నెలల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. రైల్వే అధికారులు మమ్మల్ని ఖాళీ చేయమని పదే పదే నోటీసులు పంపుతున్నారు. ప్రత్యామ్నాయం చూపితే వెళ్లిపోతాం. ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. రోజువారీ కూలీ చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. అర్థం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలి.

– వున్నమ్‌ జ్యోతి, స్థానికురాలు

ఇదేమన్నా రాచరిక వ్యవస్థా? ప్రజల కోసం పాలనంటూ ఢాంబికాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి మేం కనిపించడం లేదా? పేదలకు ఆపదొస్తే మొహం చాటేస్తారా? ఓట్లు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ సాయం చేయకపోగా చస్తే చావండని వెటకారంగా నవ్వుతున్నారు. ఇది న్యాయమేనా? మాకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఖాళీ చేయమంటే చేయం. ఉన్న ప్రాంతంలోనే ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా సిద్ధమే. ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలి

– షేక్‌ బీబీ, స్థానికురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement