నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం 22న జెడ్పీ సర్వసభ్య సమావేశం మైనర్లకు వాహనాలివ్వొద్దని ఎస్పీ హెచ్చరిక ఆక్స్‌ఫర్డ్‌ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు

నరసరావుపేట టౌన్‌: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్‌ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్‌ సీఐ చంద్రశేఖర్‌ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్‌కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్‌ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు.

25న స్థాయీ సంఘ సమావేశాలు

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్‌ విడుదల చేశారు.

నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్‌ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్‌ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్‌ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్‌, ర్యాష్‌/ ట్రిపుల్‌ రైడింగ్‌లు, లైసెన్సు, బీమా, హెల్మెట్‌, నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్‌), అబ్దుల్‌ అజీజ్‌ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్‌బీ), సీఐలు ఎ.అశోక్‌కుమార్‌ (తూర్పు ట్రాఫిక్‌), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్‌), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్‌), శివప్రసాద్‌ (లాలాపేట పీఎస్‌), ఆరోగ్యరాజు (అరండల్‌పేట పీఎస్‌), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్‌), ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు.

లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ కళాశాలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్‌ హాల్‌ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్‌ఫర్డ్‌ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్‌ఫర్డ్‌ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్‌ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్‌ దీప, హాస్టల్‌ ప్రిన్సిపల్‌ ప్రసన్న, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement