గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్‌కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్‌కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గమ్మకు కానుకగా బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.


