బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్‌ఎస్ భారవి ఫ్లై ఓవర్ నిర్మాణంలో నిబంధనలు పాటించని అధికారులు రోడ్లు మూసేసి నిర్మాణ పనుల కొనసాగింపుతో ప్రజలకు ఇబ్బందులు
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముందుగానే అండర్ బ్రిడ్జి నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్‌ఎస్ భారవి అన్నారు. శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తూనే ప్రజల రవాణా అవసరాలకు ఇరువైపులా రోడ్డు వదిలి వేయాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బ్రాడీపేట వైపు రోడ్లు మూసి వేశారని, ఫలితంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ డిజైన్‌లో అనేక మార్పులు చేయాలని ఏడాది కాలంగా జేఏసీ తరపున అనేక సూచనలు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అతి ముఖ్యమైన ఆర్‌యూబీ నిర్మాణాన్ని అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి జనార్ధన్‌రెడ్డి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి ముందుగాచే ఆర్‌యూబీ నిర్మించాలని ప్రతిపాదించడం మంచి పరిణామమని అన్నారు. సర్వీస్ రోడ్లు కనీసం 30 అడుగులు ఉండే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత డిజైన్‌లో కాలువల నిర్మాణం పోనూ రోడ్డుకు 17 అడుగులే మిగిలే పరిస్థితుల్లో, వాహనాల రాకపోకలకు సరిపోదన్నారు. 120 అడుగుల వెడల్పుతో ముందుగానే రోడ్డును విస్తరించి, విద్యుత్ స్తంభాలను తరలించి, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉండగా, హడావిడిగా పాత బ్రిడ్జిని కూల్చి వేశారని చెప్పారు. ఫలితంగా నగర ప్రజలు తీవ్రమై ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పటికై భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, ప్రత్యామ్నాయ రోడ్లను సిద్ధం చేసి ఫ్లై ఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, కమలకాంత్, పీఎస్.మూర్తి, జి.వెంకట్రావ్, వి.సదాశివరావ్ పాల్గొన్నారు.


