‘సుఖీభవ’పై చేతులెత్తేశారు! చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. సీఎం చంద్రబాబు తీరుపై రంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరిటెపాడు(గుంటూరు): అన్నదాత సుఖీభవ రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024 జూన్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్–6 హామీలు పక్కన పెట్టేశారు. ఇందులో భాగంగానే 2024–25లో అన్నదాత సుఖీభవను ఎగ్గొట్టడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. 2025–26 నుంచి అమలు చేస్తున్నా మమ అనిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాత సుఖీభవ కింద సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతులకు రూ.14 వేలు మాత్రమే లభించాయి. మూడో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు విడుదల చేయాల్సి ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 24 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు మూడో విడత సాయం రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా తామే రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరూవాడా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌తో ముడిపెట్టి రూ.14 వేలకు మాత్రమే పరిమితం అవుతుండటంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవను పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నప్పటికీ మూడో విడత ఊసే లేకుండా పోయింది.
మొంథా తుపాను, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు. 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సంభవించిన మొంథా తుపాను, అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయించి పంట నష్టాన్ని అతి తక్కువగా చూపించింది. 3,800 మంది రైతులకు చెందిన 6,062.21 ఎకరాల్లో వ్యవసాయ , ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అతి తక్కువ నమోదు చేసినా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇంత వరకు రైతులకు చెల్లించలేదు. దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ సుమారు రూ.10 కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది.
రైతులు ప్రీమియం చెల్లిస్తే 2024–25 రబీ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను పక్కన పెట్టి ప్రీమియం చెల్లించిన రైతులకే వర్తిస్తుందని చెబుతున్నారు. 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్‌లో రైతులు ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నప్పటికీ పరిహారం ఊసే లేకుండా పోయింది. మొంథా తుఫాన్, అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం లేదు. ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నా పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2025–26 రబీలో పంటల బీమాను అమలే చేయలేదు. పంటలు దెబ్బతిన్నప్పటికీ బీమా జాడనే లేకుండా పోవడం రైతులకు తీవ్ర ఆందోళన మిగిల్చింది.
చంద్రబాబు ప్రభుత్వంలో కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో కౌలుదారులకు రూపాయి కూడా చెల్లించలేదు. గుంటూరు జిల్లాలో సుమారు 30 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేశారు. ఒక్క కౌలు రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అమలు కాలేదు. కౌలు రైతులతోపాటు ఎండోమెంట్, అటవీ భూములు అనుభవిస్తున్న వారికి, అసైన్డ్ భూములకు, వేలాది పట్టాదారులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌలు రైతులతోపాటు ఎండోమెంట్, అటవీభూములు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్ధికంగా చేయూత ఇచ్చింది.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తుపాన్లు, అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లితే కేవలం నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేది.
● పంట నష్టం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేపట్టడం, ఆ వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు పంపడం, కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాలకు డీబీటీ ద్వారా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం ఆనవాయితీగా ఉండేది.
● రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది.
● ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందే పంటల బీమా కింద రైతులకు పరిహారం చెల్లించే వారు.
● నోటిఫై చేసిన పంట ఏదైనా ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు బీమా అమలులో ఉన్నట్లే.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ లబ్ధిదారులు
– 1,26,030 మంది
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు – 1,06,329 మంది
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవకు దూరమైన రైతులు – 19,701 మంది
సీసీఆర్‌సీ కార్డులు ఉన్నా అన్నదాత సుఖీభవ అందని కౌలు రైతులు– 30 వేల మంది
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న కౌలు రైతులు–25 వేల మంది
2024–25లో అందని అన్నదాత సుఖీభవ 2025–26 నుంచి అరకొరగా అమలు ఏడాది ముగుస్తున్నా మూడో విడత మాటే లేదు! అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు నష్టపరిహారం ఊసే కరువు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. సీఎం చంద్రబాబు తీరుపై రంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో రూ.10 కోట్లు..
ధీమా ఇవ్వని బీమా..
కౌలు రైతులకు మొండిచేయి
వైఎస్సార్ సీపీ హయాంలో..