దుగ్గిరాల: కళాశాల విద్యార్థినులు, మహిళల ఫొటో చిత్రీకరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని విచారించామని సీఐ బ్రహ్మం, ఎస్‌ఐ వెంకట రవి తెలిపారు. దుగ్గిరాల పోలీసుస్టేషన్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ విజయవాడలోని ఓ కళాశాలలో పని చేస్తున్న మహిళ తన స్నేహితురాలితో కలసి వెళుతున్న సమయంలో తుమ్మపూడికి చెందిన ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు గమనించి ప్రశ్నించగా అతను దుర్భాషలాడి బెదిరించాడని, అతని దగ్గర నుంచి సెల్‌ఫోన్ తీసుకుని చూడగా ఫొటోలు ఉన్నట్లు గుర్తించామని బాధితురాలు దుగ్గిరాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, నిందితుడ్ని 24 గంటలలోనే అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. సరదాకు వీడియోలు తీస్తున్నానని, రాత్రి వేళలలో ఆ వీడియోలు చూస్తూ ఉంటానని విచారణలో అతను చెప్పినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ పరిశీలించగా సుమారు 1,060 ఫొటోలు ఉన్నాయని, 101 ఫొటోలు మాత్రమే మహిళల ఫొటోలు తీశాడని, మిగిలినవి వాట్సాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నవేనని తెలిపారు. సెల్‌ఫోన్ సీజ్ చేశామని అన్నారు. అతను ఆ ఫొటోలను ఎటువంచి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించలేదని, మార్ఫింగ్ కూడా చేయలేదని తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీయడం నేరం కాబట్టి అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఫొటోలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళ రక్షణకు ఆటంకం కలిగితే వెంటనే సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.


