దయతో వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

దయతో వైద్య సేవలందించాలి

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 7:50 AM

గుంటూరు మెడికల్‌: వైద్యులు దయతో రోగులకు వైద్య సేవలందించాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ఎంబీబీఎస్‌ 2020 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల గ్రాడ్యూయేషన్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

● వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య వృత్తి చాలా ఉన్నతమైందని, సేవ చేసే అవకాశం వైద్యులకే దక్కుతోందన్నారు. మంచిగా సేవ చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. గతేడాది గుంటూరు రూరల్‌ మండలంలో మెలోడేస్‌ మరణాలు సంభవించాయని, మంత్రి పెమ్మసాని చెప్పారు. అలాంటి మరణాలను కేస్‌ స్టడీగా తీసుకుని పరిశోధనలు చేయవచ్చన్నారు.

● వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి మాట్లాడుతూ డాక్టర్‌ పట్టా పొందడం విజయం కాదని, ఇది విజయానికి ప్రారంభమని చెప్పారు. వైద్యులుగా వృత్తిలో రాణించాలంటే విలువలు పాటించాలని, నిజాయితీగా, హుందాగా ఉండాలని, క్యారెక్టర్‌ పెంపొందించుకోవాలన్నారు. డాలర్స్‌ కోసం పరుగులు తీయవద్దని, కుటుంబ సభ్యుల మాదిరిగా రోగులను ఆదరించాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌శ్రీధర్‌, జింకానా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.వి.హనుమంతరావు పాల్గొన్నారు.

మధుర క్షణాలతో కళ్లు మెరిశాయి

ఎంబీబీఎస్‌ డిగ్రీ పట్టా అందుకునే ఆనందంతో పలువురు వైద్య విద్యార్థులు వేడుకలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డాక్టర్‌ డిగ్రీ పట్టాలు చేతికి అందిస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు, బంధువుల కళ్లు ఆనంద భాష్పాలతో మెరిశాయి. ఆ మధుర సన్నివేశాలను చిత్రీకరించేందుకు పలువురు కెమెరాలు తీసుకుని పోటీ పడ్డారు. కళాశాల అంతా గ్రాడ్యుయేషన్‌ డే కోర్టులు ధరించి కలియతిరిగి వైద్య విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్పిన కళాశాల బోధనా సిబ్బందితో జీవితాంతం గుర్తుండేలా డిగ్రీ పట్టాలు అందుకున్న 250 మంది వైద్య విద్యార్థులు గ్రూఫ్‌ ఫొటోలు దిగారు. పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

కేంద్ర సహాయ మంత్రి

డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌

పరిశోధనల వైపు దృష్టి సారించాలి

ఘనంగా గుంటూరు వైద్య కళాశాల

2020 బ్యాచ్‌ గ్రాడ్యూయేషన్‌ డే వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement