వేజండ్ల(చేబ్రోలు): మండలంలోని వేజండ్ల గ్రామంలో శుక్రవారం డొంకరోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌పై ‘డొంకనూ దోచేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితం కావటంతో తవ్వకాలు నిలిపివేశారు. వేజండ్ల జడ్పీ హైస్కూల్ పక్కన ఉన్న ప్రభల డొంక రోడ్డును యంత్రాలతో తవ్వకాలు చేసి అధికార పార్టీ నాయకులు ఎర్ర గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకోవటంపై విమర్శలు వచ్చాయి. శనివారం ఉదయం పెద్ద పెద్ద యంత్రాలతో స్థానిక నాయకులు రెండో రోజు తవ్వకాలు మొదలు పెట్టారు. స్థానికులు, గ్రామస్తులు రెవెన్యూ, పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఈఓపీఆర్డీ ఎం.రవిశంకర్‌ల ఆదేశాలతో డొంక రోడ్డులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌ను నిలుపుదల చేశారు.


