నెహ్రూనగర్(గుంటూరు తూర్పు): 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.1700,61,81,065 కోట్ల అంచనాలతో నగర పాలక సంస్థ బడ్జెట్‌ను ఆమోదించామని స్టాండింగ్ కమిటీ చైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్‌లో నగర కమిషనర్ మయూర్ అశోక్‌తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన ప్రియాంబుల్స్, బడ్జెట్ తదితర అంశాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ వివిధ విభాగాధిపతులతో కలిసి విపులంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2026–27 సంవత్సానికి రూ.1700,61,81,065 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆమోదించామని, ప్రారంభ నిల్వ రూ.774,28,13,058 కోట్లు, జమలు రూ.926,33,68,007 ఉన్నాయన్నారు. నగర పాలక సంస్థ సంపరిధిలోని మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్, క్యాంటీన్లకు సంబంధించి టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించడానికి సవరణలు చేసి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, స్థాయి సంఘ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీ దుర్గ, ముప్పవరపు భారతి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలీషా, ఎస్‌ఈ జి.వెంకటేశ్వర రావు, ఎంహెచ్‌ఓ లక్ష్మీ నారాయణ, నగర పాలక సంస్థ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


