స్వచ్ఛ ఆంధ్ర అంటూ ఒకవైపు చంద్రబాబు సర్కార్ హడావుడి అభివృద్ధి పనుల పేరిట చెరువులోకి మురుగునీటి పైపులైను అధికారుల తీరు చూసి మంగళగిరి వాసుల ఆగ్రహం
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అంటూ రూ.కోట్లు ఖర్చు చేస్తూ ప్రచారాన్ని ఊదరకొడుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ మురుగునీటిని తీసుకువచ్చి చెరువులో కలిపేందుకు ఎంటీఎంసీ అధికారులు శుక్రవారం డ్రైనేజీ కాలువ నుంచి చెరువులోకి పైపులైను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని నులకపేటలో ఉన్న చెరువును రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేయాలని పనులు చేపట్టింది. ప్రజల సౌకర్యార్థం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో నులకపేట కృష్ణానగర్ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ చెరువులో పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని కలుపుతున్నారు. చెరువును అభివృద్ధి చేస్తూ పార్కును ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టడంతో చెరువుకు మహర్దశ వచ్చింది, స్వచ్ఛమైన నీరు ఉంటుందని ప్రజలు భావించారు. కానీ అధికారులు దానికి విరుద్ధంగా నులకపేట బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీ, యర్రక్వారీ, మసీదు సెంటర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని తిరిగి అదే చెరువులోకి కలపడానికి పైపు లైను వేస్తున్నారు. రూ.9 కోట్లతో అభివృద్ధి చేసినా మురుగువాసన తప్పదంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంటీఎంసీ అధికారులు నులకపేట చెరువులో మురుగునీటిని కలపకుండా వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని, చెరువును ఇకనైనా పరిశుభ్రంగా ఉంచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.


