9న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక, రైతు సంఘం నాయకులు పిలుపు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 11 మండలాలలో 40 గ్రామాలలో సుమారు 6 వేల ఎకరాల భూములు సేకరించనున్నట్లు అధికారులు తెలియజేశారని తెలిపారు. ముందుగా ఆయా రైతులకు సమాచారం తెలపకుండా, గ్రామ సభలు జరపకుండా, కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా 250 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మాణం చేయనున్నట్లుగా ప్రకటించడంతో ఆయా మండలాలు గ్రామాలలోని రైతులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువను ఆధారం చేసుకుని నష్టపరిహారం సరికాదని, మూడు పంటలు పండే సారవంతమైన భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జిల్లా, మండల రెవెన్యూ అధికారులకు హైవే అథారిటీ అధికారుల అర్జీల ద్వారా విషయం తెలిపి, తమ ఇబ్బందిని వివరించినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతులలో, పేద ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలిగించే ప్రయత్నం అధికారులు చేయాలని పేర్కొన్నారు. వెంటనే గ్రామ సభలు జరిపి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని తెలిపారు. 70 మీటర్లకు మించి సేకరణ చేయరాదని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి జరిగే ధర్నాలో బాధితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బిక్కి శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకురాలు కె.పద్మావతి, గుంటుపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


