నాణ్యమైన మానవ వనరులే కీలకం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన మానవ వనరులే కీలకం

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

మాజీ డీజీపీ మాలకొండయ్య

ఏఎన్‌యూ(పెదకాకాని): నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకమని ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత మాజీ డీజీపీ మాలకొండయ్య అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘విద్య– పరిశ్రమల సమ్మేళనం–2026’ శుక్రవారం రెండవరోజుకు చేరింది. ముఖ్యఅతిథిగా మాజీ డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సత్సంబంధాలు అవసరం అన్నారు. అప్పుడే విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించటానికి విద్యార్థులకు ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అధ్యాపకులు ప్రయోగాత్మకంగా బోధన చేయాలని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏఎన్‌యూ రెక్టార్‌ ఆచార్య ఆర్‌. శివరాంప్రసాద్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది 500 కంపెనీలకు తగ్గకుండా సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలోని రామకృష్ణ మిషన్‌ కార్యదర్శి స్వామీజీ మాట్లాడుతూ విద్యార్థులు తమ దృష్టిని లక్ష్యం దిశగా కేంద్రీకరించినప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తారన్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత పరిశ్రమల ప్రతినిధి సాంబశివరావు మాట్లాడుతూ నేడు చదువు, సంస్కారం రెండుగా విడిపోయాయని, దీనివల్ల సమాజంలో దుష్ఫలితాలు ఎదురవుతున్నాయన్నారు. డ్రోన్‌ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సమ్మేళనం కన్వీనర్‌ ఆచార్య పి.పద్మావతి, సంచాలకులు ఆచార్య లింగరాజు, ఆర్ట్స్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు, సోషల్‌ సైన్స్‌ డీన్‌, దూరవిద్య సంచాలకులు ఆచార్య వి.వెంకటేశ్వర్లు, అవగాహన ఒప్పందాల కమిటీ సభ్యులు, సీడీసీ డీన్‌ ఆచార్య వి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనంలో భాగంగా శుక్రవారం వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏఎన్‌యూ అధికారులు పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement