మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు, సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎయిమ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిమ్స్‌లో సమస్యలను అధిగమించే అంశంపై గతంలో రివ్యూల్లో సమీక్షించామని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకడమిక్ ఇనిస్టిట్యూట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి దాదాపు 500 పోస్టులకు అనుమతులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఎయిమ్స్‌లో గతంలో 12 ఆపరేషన్ థియేటర్లు ఉండగా నేడు 87 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్త పరీక్షలకు ఆలస్యం అవుతుందని, మిగతా అన్ని పరీక్షలు త్వరగానే రిపోర్టులు వస్తున్నాయని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఫార్మసీ కౌంటర్లు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో బస్ షెల్టర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం సాంతాసింగ్, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.


