అంతరిక్షం మన జీవితంలో భాగం
చేబ్రోలు: ‘అంతరిక్షం కేవలం పరిశోధనలకే పరిమితం కాదు, అది నేడు దేశ రక్షణలో అంతర్భాగమైంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రం’ అని డీఆర్‌డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’లో భాగంగా నిర్వహించిన సౌత్ ఇండియా రాక్రెటీ ఛాలెంజ్ రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. విజ్ఞాన్ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు చేతుల మీదుగా అవగాహన పత్రాలను మార్చుకున్నారు.
● కార్యక్రమంలో డాక్టర్ జి. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ... స్పేస్ అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుందని దశాబ్దాల క్రితమే చెప్పారని, నేడు అది అక్షరాలా నిజమైందన్నారు. ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతికత నిలిచిపోతే మన కమ్యూనికేషన్ వ్యవస్థ, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, చివరికి టీవీ చానల్స్ కూడా మూతపడతాయన్నారు. సామాన్యుడి దైనందిన జీవితం అనేది స్తంభించిపోతుందన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరని అందుకు బెల్లాట్రిక్స్, దిగంతర సంస్థలు ఉదాహరణలుగా వివరించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా స్వయంగా ఒక శాటిలైట్‌ను తయారు చేసి ప్రయోగించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
● చాన్సలర్, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు, మాట్లాడుతూ దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందన్నారు. ఉపగ్రహాల ద్వారా హైస్పీడ్ డేటా కమ్యూనికేషన్ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.
● ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల్లో అపజయాలను చూసి కుంగిపోకూడదని, వైఫల్యాలను ఎదుర్కోవడం నేర్చుకున్నప్పుడే గొప్ప విజయాలు లభిస్తాయన్నారు. విద్యార్థులు పూర్తి సామర్థ్యంతో తమ రాకెట్లను ప్రయోగించి సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. విద్యార్థులు అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారని, కెమికల్ రాకెట్‌ను ఏకంగా 1.5 కిలోమీటర్ల ఎత్తుకు విజయవంతంగా ప్రయోగించి ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు.
● కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఏపీ స్పేస్ టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. శేషగిరిరావు, సీఈవో కూరపాటి మేఘన, ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఆర్‌డీవో మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి
విజ్ఞాన్‌లో రెండో రోజు ఘనంగా
కొనసాగిన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్
అంతరిక్షం మన జీవితంలో భాగం


