ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?
మడకశిర: చంద్రబాబు సర్కార్ పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగిస్తోంది. అక్రమ కేసులతో తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మంగళగిరికి చెందిన ఇంద్రాసేనారెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని గుడిబండ మండలం సీసీగిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మంజునాథ్ గురువారం గుడిబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇంద్రాసేనారెడ్డిపై కేసు నమోదు చేశారు. మడకశిర పోలీసులు గురువారం రాత్రే మంగళగిరికి వెళ్లి ఇంద్రాసేనారెడ్డిని అదుపులోనికి తీసుకుని శుక్రవారం మడకశిరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ... తాను ఎవరినీ కించపరిచేలాగానీ, అభ్యంతరకరంగా వ్యాఖ్యలుగానీ చేస్తూ పోస్టు పెట్టలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే పోస్టు పెట్టానని తెలిపారు. పోలీసులు తనను ఇలా వేధించడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మడకశిర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్దన్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, మడకశిర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి, నాయకులు రంగనాథ్, నరేష్‌రెడ్డి, మంజునాథ్, చిరంజీవి తదితరులు రూరల్ సీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంద్రాసేనారెడ్డికి అండగా నిలబడ్డారు. రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్‌ఐ రాజ్ కుళ్లాయప్పతో మాట్లాడారు. వెంటనే ఇంద్రసేనారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈర లక్కప్ప స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. టీడీపీ నాయకుల ఆదేశాలతో పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం పోలీసులు ఇంద్రసేనారెడ్డికి నోటీసు ఇచ్చి పంపారు.
మడకశిర పోలీసుల అత్యుత్సాహం
మంగళగిరి నుంచి సోషల్‌మీడియా యాక్టివిస్టును తీసుకువచ్చిన వైనం


